హైదరాబాద్ రోడ్లపై రోజు లక్షల వాహనాలు రాకపోకలు సాగిస్తుంటాయి. దీంతో కూడళ్లల్లో విపరీతంగా ట్రాఫిక్ ఏర్పడుతుంది. ఇక్కడ వాహనాల సరాసరి వేగం కూడా చాలా తక్కువ. వాహనాల రద్దీతో భాగ్యనగరంలోని చాలా రోడ్లు తీవ్రంగా దెబ్బతిన్నాయి. కొన్ని రోడ్లపై ప్రయాణం.. నరకాన్ని తలపిస్తుందని వ్యాఖ్యలూ ప్రజల నుంచి వినిపిస్తుంటాయి. ఈ పరిస్థితి.. నిన్నమొన్న ఏర్పడింది కాదు.. ఏళ్లుగా ఇక్కడి రోడ్ల స్థితిగతులు ఇలానే ఉంటున్నాయి. కానీ స్వరాష్ట్రం సిద్ధించాక.. రాష్ట్రాభివృద్ధికి దీర్ఘకాలిక ప్రణాళికలు రచించింది ప్రభుత్వం. దానికి తోడు.. ప్రపంచ స్థాయిలో దిగ్గజ సంస్థలతో ఒప్పందాలు కుదుర్చుకునేందుకు.. ఇక్కడి ట్రాఫిక్, రోడ్ల తీరు ప్రభావం చూపుతాయని గుర్తించింది. అందుకే.. రోడ్లను పూర్తిగా మార్చివేసేందుకు.. ప్రణాళికలు రచించింది.
హైదరాబాద్ సర్వతోముఖాభివృద్ధి కోసం 67,035.16 కోట్ల నిధులు
విశ్వనగరం స్థాయికి తగ్గట్టుగా.. ప్రజలకు మెరుగైన సౌకర్యాలు కల్పించే దిశగా ప్రభుత్వం అభివృద్ధి కార్యక్రమాలపై దృష్టి సారించింది. గడిచిన ఆరేళ్లలో రాష్ట్ర రాజధాని హైదరాబాద్ సర్వతోముఖాభివృద్ధి కోసం 67,035.16 కోట్ల మేర నిధులను ఖర్చు చేసింది. ఒక్క జీహెచ్ఎంసీ పరిధిలోనే మౌలికవసతులు, సౌకర్యాల మెరుగుదల కోసం రూ. 32,532 కోట్లు ఖర్చు చేశారు. ఇందులో దాదాపు 80 శాతం నిధులను ఫ్లైఓవర్లు, అండర్‌పాస్‌లు, రోడ్లు, పేదల రెండు పడకల ఇళ్ల కోసం వినియోగించారు. రద్దీగా ఉండే ప్రధాన రహదారులు, వ్యాపార-వాణిజ్య కార్యకలాపాలు అధికంగా ఉన్న మార్గాలను ఎస్ఆర్‌డీపీ కింద ఎంపిక చేశారు. ఇందులో భాగంగా బంజారాహిల్స్, జూబ్లీహిల్స్, హైటెక్ సిటీ, కూకట్‌పల్లి, బాచుపల్లి, పటాన్‌చెరువు, ఆబిడ్స్, చార్మినార్, ఎల్బీనగర్, చాంద్రాయణగుట్ట, శంషాబాద్ విమానాశ్రయం, ఉప్పల్, సికింద్రాబాద్, ఈసీఐఎల్, అల్వాల్, కొంపల్లి, జీడిమెట్ల తదితర ప్రాంతాలను అభివృద్ధి చేశారు. నిధుల లభ్యత, తక్కువ భూసేకరణ అవసరమైన కారిడార్లకు ప్రాధాన్యతనిస్తూ ఐదు దశల్లో జీహెచ్ఎంసీ పనులను చేపట్టింది.
ఎస్ఆర్డీపీలో భాగంగా రూ.1,010.77 కోట్లతో చేపట్టిన 18 ప్రాజెక్టులు
అభివృద్ధి పనుల్లో ప్రధానంగా రోడ్లు, ట్రాఫిక్ సమస్యకు అధిక ప్రాధాన్యమిస్తూ వ్యూహాత్మక రోడ్ల అభివృద్ధి ప్రణాళిక(ఎస్ఆర్‌డీపీ), సమగ్ర రోడ్ల నిర్వహణ ప్రణాళిక(సీఆర్ఎంపీ) పథకాలను చేపట్టారు. ఎస్ఆర్‌డీపీ కింద పెద్ద ఎత్తున ఫ్లైఓవర్లు, అండర్‌పాస్‌లను నిర్మించారు. మొత్తం 46 ప్రాంతాల్లో ప్లైఓవర్ల నిర్మాణం చేపట్టారు. మరికొన్ని పురోగతిలో ఉన్నాయి. అదనంగా 46 జంక్షన్ల అభివృద్ధి పనులు చేపట్టారు. వీటికి మొత్తం రూ 8,410 కోట్లు ఖర్చు చేశారు. రోడ్ల ఏర్పాటు, రహదారుల విస్తరణ, మౌలిక సదుపాయాలకు రూ 5,043 కోట్లు ఖర్చు చేశారు. రహదారుల స్థితిగతులను మెరుగుపరిచే ఉద్దేశంతో ప్రధాన రోడ్ల నిర్వహణ బాధ్యతలను సీఆర్ఎంపీ కింద ప్రైవేటు ఏజెన్సీలకు అప్పగించారు. మొదటి దశలో 709 కిలోమీటర్ల మేర రహదారుల నిర్వహణ బాధ్యతలను ప్రైవేటు ఏజెన్సీలకు అప్పగించగా, ఐదేండ్లపాటు వాటి నిర్వహణ కోసం రూ 1,839 కోట్లు కేటాయించారు. ఇప్పటి వరకు ఎస్ఆర్డీపీలో భాగంగా రూ.1,010.77 కోట్లతో చేపట్టిన 18 ప్రాజెక్టుల నిర్మాణాలను పూర్తిచేశారు. ఇందులో 9 ప్లైఓవర్లు, 4 అండర్‌పాస్‌లు, 3ఆర్వోబీ/ఆర్‌యూబీతో పాటు ఓ కేబుల్ బ్రిడ్జ్, మరో వంతెన నిర్మాణాలు ఉన్నాయి. మరో రూ.4,780 కోట్లతో చేపట్టిన పనులు వివిధ దశల్లో పురోగతిలో ఉన్నాయి.