Telangana Government Replaces GHMC Officials :రాష్ట్రంలో కొత్త ప్రభుత్వం కొలువుదీరనున్న నేపథ్యంలో, గ్రేటర్ హైదరాబాద్ పరిపాలనలో కీలకమైన విభాగాల్లో మార్పులు చేర్పులు జరగనున్నాయి. ప్రస్తుతం ఉన్న సిబ్బందిలకు స్థానచలనం జరిగే అవకాశాలు ఉన్నాయి. రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటు తర్వాత వారంలో ఈ ప్రక్రియ ప్రారంభం కానుంది.
నగరాభివృద్ధిలో జీహెచ్‌ఎంసీ(GHMC), జలమండలి, హెచ్‌ఎండీఏలే ప్రధాన పాత్ర పోషిస్తుంది. రూ.వేల కోట్ల విలువైన అభివృద్ధి పనులు ఆయా ప్రభుత్వ విభాగాల పరిధిలో కొనసాగుతున్నాయి. రాష్ట్రవ్యాప్తంగా ప్రభుత్వం పట్ల ఒక సానుకూలత రావాలంటే రాజధాని హైదరాబాద్‌లో మౌలిక వసతుల దగ్గర నుంచి పాలన వ్యవహారాల్లో పారదర్శకత అనేది చాలా అవసరం. ముఖ్యంగా నీటి సరఫరా, పారిశుద్ధ్య నిర్వహణ, మురుగు నీటి, ప్లానింగ్ లాంటి అంశాల్లో ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఎప్పుకప్పుడు చూసుకోవాల్సిందే.
హెచ్‌ఎండీఏకు పూర్తిస్థాయి కమిషనర్ :ప్లానింగ్‌లో కీలకమైన హైదరాబాద్ మహానగరాభివృద్ధి సంస్థ(HMDA)కు పూర్తిస్థాయి కమిషనర్ లేకపోవడంతో సమస్యల పరిష్కారంలో ఆలస్యం జరుగుతోంది. అయితే ప్రస్తుతం మున్సిపల్ శాఖ ప్రత్యేక ముఖ్య కార్యదర్శి అర్వింద్‌కుమార్ హెచ్‌ఎండీఏ కమిషనర్‌గా వ్యవహరిస్తున్నారు. అక్కడా ఇక్కడా విధుల నిర్వహణలో సమన్వయం ఉండటం లేదనే విమర్శలు వెల్లువెత్తున్నాయి. ఏదైనా కీలకమైన సమీక్ష సమావేశం ఉంటే తప్పా, పూర్తిస్థాయిలో హెచ్‌ఎండీఏపై దృష్టి సారించక పోవడంతో కిందిస్థాయి అధికారులు, సిబ్బందికి ఆడిందే ఆటగా పాడిందే పాటగా సాగుతోంది.
HMDA New Boss 2023 :ముఖ్యంగా హెచ్‌ఎండీఏ పరిధిలో రూ.వేల కోట్ల విలువైన భూములు ఉన్నాయి. ఇప్పటికే కొంత భూమిని వేలం ద్వారా విక్రయించారు. మరికొన్ని వేలం వేసే క్రమంలో శాసనసభ ఎన్నికలు రావడంతో ఆ ప్రక్రియ అక్కడితో నిలిచిపోయింది. 7 జిల్లాల పరిధిలోని కొన్ని భూములు ఆక్రమణలకు గురవుతున్నాయి. ఇటీవలే శంషాబాద్‌లో ఓ నేత 50 ఎకరాలు హెచ్‌ఎండీఏ స్థలాన్ని ఆక్రమించే ప్రయత్నం చేసినా, ఆఖరి వరకు అధికారులు గుర్తించలేకపోయారు. పలు ఫిర్యాదుల నేపథ్యంలో చివరిలో అడ్డుకట్ట వేశారు. నగరంలో ఇలాంటివి జరుగుతూనే ఉన్నాయి. ప్రణాళిక విభాగంలో అధికారులు, సిబ్బంది పనితీరుపై ఆరోపణలు ఉన్నాయి. పూర్తిస్థాయి కమిషనర్ లేకపోవడంతో కొన్నాళ్లుగా హెచ్‌ఎండీఏలో పాలన గాడి తప్పిందనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. రాష్ట్రంలో కొత్త ప్రభుత్వం రానున్న దృష్ట్యా హెచ్‌ఎండీఏకు నూతన కమిషనర్‌ను నియమించే అవకాశం ఉంది.