Telangana Police Recruitment 2022 : తెలంగాణలో పోలీసు ఉద్యోగాలకు రాష్ట్ర ప్రభుత్వం నోటిఫికేషన్ జారీ చేసింది. పోలీసు శాఖలోని పెద్ద ఎత్తున పోస్టులను ప్రభుత్వం భర్తీ చేయనుంది. కానిస్టేబుల్ పోస్టులతో పాటు వివిధ విభాగాల్లో భారీ స్థాయిలో ఎస్‌ఐ పోస్టులను భర్తీ చేయనున్నట్లు పోలీసు నియామక మండలి జారీ చేసిన నోటిఫికేషన్లో పేర్కొన్నారు. మొత్తం 16,027- కానిస్టేబుల్, 587- ఎస్‌ఐ పోస్టులకు నియామాక మండలి నోటిఫికేషన్ విడుదల చేసింది. మే 2వ తేదీ నుంచి 20 వరకు ఆన్‌లైన్‌లో దరఖాస్తులు స్వీకరించనున్నట్లు పోలీసు నియామక మండలి ఛైర్మన్ శ్రీనివాసరావు తెలిపారు.
ఇందులో అత్యధికంగా 5,010- టీఎస్‌ఎస్‌పీ కానిస్టేబుల్, 4,965- సివిల్ కానిస్టేబుల్, 4,423- ఏఆర్ కానిస్టేబుల్ పోస్టులకు నోటిఫికేషన్ విడుదలైంది. 587 ఎస్‌ఐ పోస్టుల భర్తీకి ప్రభుత్వం పచ్చజెండా ఊపింది. 414- సివిల్ ఎస్సైల పోస్టులను భర్తీ చేయనుంది. 66 ఏఆర్ ఎస్సై పోస్టులు, 5 రిజర్వ్ సబ్ ఇన్‌స్పెక్టర్ పోస్టులు భర్తీ కానున్నాయి. 23- టీఎస్‌ఎస్‌పీ సబ్ ఇన్‌స్పెక్టర్, 12- ఎస్‌పీఎఫ్ సబ్ ఇన్‌స్పెక్టర్, 26- విపత్తు, అగ్నిమాపకశాఖలో ఎస్సై పోస్టులకు నోటిఫికేషన్ వెలువడింది. 8 డిప్యూటీ జైలర్ పోస్టులను భర్తీ చేయనుంది.
ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలని నోటిఫికేషన్లో పేర్కొన్నారు. అర్హులైన అభ్యర్థులు వచ్చే 2వ తేదీ 20వ తేదీ వరకు దరఖాస్తు చేసుకునేందుకు గడువు విధించారు. నియమ నిబంధనలు, గరిష్ఠ వయసు, విద్యార్హత, రుసుము, సిలబస్ తదితర వివరాలన్ని పోలీస్ నియామక మండలికి చెందిన వెబ్ సైట్లో అందుబాటులో ఉంచారు. అన్ని పోస్టులకు సంబంధించిన రుసుము విషయంలో ఎస్సీ, ఎస్టీలకు రాయితీ ఇచ్చారు.