Gruhalaxmi Scheme application process : సొంత స్థలం ఉన్న పేదలకు ఇంటి నిర్మాణం కోసం మూడు లక్షల రూపాయల ఆర్థికసాయం అందించే గృహలక్ష్మి పథకం మార్గదర్శకాలను రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది. ఈ మేరకు రహదార్లు, భవనాల శాఖ ఉత్తర్వులు జారీ చేసింది. వందశాతం రాయితీతో ప్రభుత్వం ఆర్థికసాయం అందించనుంది. నియోజకవర్గానికి 3000 చొప్పున లబ్దిదారులకు సాయం అందిస్తారు. స్టేట్ రిజర్వ్ కోటాలో 43వేలు మొత్తంగా నాలుగు లక్షల మందికి గృహలక్ష్మి పథకం కింద లబ్ది చేకూరనుంది.
జిల్లాల్లో కలెక్టర్ల ఆధ్వర్యంలో, జీహెచ్ఎంసీలో కమిషనర్ ఆధ్వర్యంలో గృహలక్ష్మి అమలు కానుంది. నోడల్ అధికారులుగా ఈ అధికారులనే వ్యవహరిస్తారు. మహిళల పేరు మీదే గృహలక్ష్మి ఆర్థికసాయం అందిస్తారు. ఇందుకోసం లబ్దిదారు మహిళ పేరిట ప్రత్యేక బ్యాంకు ఖాతా ఉంటుంది. జన్ ధన్ ఖాతాను ఎట్టిపరిస్థితుల్లోనూ ఇందుకోసం వినియోగించరాదని ప్రభుత్వం స్పష్టం చేసింది.
ఆహారభద్రత కార్డు ఉన్నవారు అర్హులు: రెండు గదులు కూడిన ఆర్సీసీ ఇళ్లు నిర్మాణం కోసం ఆర్థికసాయం ఇవ్వనున్న ప్రభుత్వం.. ఇంటి బేస్ మెంట్ లెవల్, రూఫ్ లెవల్, ఇలా మూడు దశల్లో సాయం అందిస్తారు. ఆహారభద్రత కార్డు ఉండి సొంత స్థలం ఉన్న వారు అర్హులుగా ప్రభుత్వం గుర్తించింది. ఇప్పటికే ఆర్సీసీ ఇళ్లు ఉన్న వారికి.. 59 ఉత్తర్వు కింద లబ్ది పొందిన వారికి అవకాశం లేదని స్పష్టం చేసింది. ప్రతి శాసనసభ నియోజకవర్గంలో ఎస్సీలకు 20 శాతం, ఎస్టీలకు 10 శాతం, బీసీ, మైనార్టీలకు 50 శాతానికి తగ్గకుండా లబ్దిదారులను ఎంపిక చేయాలని సూచించింది.