పర్యావరణ అనుమతులు తీసుకోకుండానే రాయలసీమ ఎత్తిపోతల పథకం చేపడుతున్నారని గవినోళ్ల శ్రీనివాస్ జాతీయ హరిత ట్రైబ్యునల్ (ఎన్జీటీ) చెన్నై బెంచ్‌ను ఆశ్రయించారు. దీనిపై నిపుణుల కమిటీని నియమించిన ఎన్జీటీ.. తెలంగాణ ప్రభుత్వం, కృష్ణా నది యాజమాన్య బోర్డు (కేఆర్‌ఎంబీ)లను తమ వాదనలు తెలియజేయాలని ఆదేశించింది. ఎన్జీటీ ఆదేశాల మేరకు తెలంగాణ ప్రభుత్వం కౌంటర్ అఫిడవిట్ దాఖలు చేసింది. ‘‘ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లోనూ తెలంగాణ ప్రాంత ప్రాజెక్టులపై వివక్ష చూపి కృష్ణా జలాలను పెన్నా, ఇతర బేసిన్లకు తరలించారు. రాష్ట్ర విభజన అనంతరం కూడా అది కొనసాగుతోంది. రాయలసీమ ఎత్తిపోతల పథకం చేపట్టడం వల్ల తెలంగాణ ప్రయోజనాలకు తీవ్ర విఘాతం కలుగుతుంది. దీనిని కచ్చితంగా నూతన ప్రాజెక్టుగానే పరిగణించాలి. కృష్ణా జలాల వివాద ట్రైబ్యునల్-1 శ్రీశైలం ప్రాజెక్టు నుంచి ఇతర బేసిన్లకు జలాలను కేటాయించలేదు. అయినా ఉమ్మడి రాష్ట్రంలో 15 టీఎంసీల తరలింపునకు చెన్నై తాగునీటి సరఫరా పథకం, 19 టీఎంసీల తరలింపునకు ఎస్సార్బీసీ చేపట్టారు. తెలంగాణలోని దిగువ ప్రాజెక్టులు, హైదరాబాద్ మహా నగర తాగు నీటి అవసరాలు, కరవు పీడిత ప్రాంతాల ప్రయోజనాలకు విరుద్ధంగా కృష్ణా జలాలను ఇతర బేసిన్లకు తరలించే ఉద్దేశంతో తాజాగా రాయలసీమ ఎత్తిపోతల ప్రాజెక్టు చేపట్టారు. ఈ ప్రాజెక్టుతో శ్రీశైలం జలాశయం నుంచి కృష్ణా జలాలను ఇతర బేసిన్లకు తరలిస్తే నాగార్జునసాగర్ ఆయకట్టుతో పాటు ఫ్లోరైడ్ ప్రభావిత ప్రాంతాలకు నీరందించే మిషన్ భగీరథ, హైదరాబాద్ నగరంలోని రెండు కోట్ల ప్రజల తాగు నీటికి ఇబ్బందులు ఎదురవుతాయి. నది దిగువన పర్యావరణంపైనా తీవ్ర ప్రతికూల ప్రభావం చూపుతుంది. కేంద్ర పర్యావరణ మంత్రిత్వ శాఖ నుంచి అనుమతులు తీసుకోనందున ఈ ప్రాజెక్టు నిర్మాణం అక్రమమే’’ అని స్పష్టం చేసింది.
ఇతర బేసిన్లకు చట్టబద్ధమే అయితే....