'ప్రభుత్వం నుంచి ఎక్కువే ముట్టింది... ఆర్టీసీనే బాకీ పడింది...' ఆర్టీసీ సమ్మె కేసులో హైకోర్టుకు ప్రభుత్వాధికారులు అఫిడవిట్లు సమర్పించారు. న్యాయస్థానానికి ఆర్టీసీ ఇన్ఛార్జ్ ఎండీ సునీల్ శర్మ, ఆర్థికశాఖ ముఖ్యకార్యదర్శి రామకృష్ణారావు, జీహెచ్ఎంసీ కమిషనర్ లోకేశ్‌కుమార్ వేరువేరుగా నివేదికలు ఇచ్చారు.
ప్రభుత్వానికే ఆర్టీసీ బాకీ పడింది...
ఆర్టీసీకి ప్రభుత్వం ఎలాంటి బకాయి లేదని ఆర్థికశాఖ ముఖ్యకార్యదర్శి రామకృష్ణారావు స్పష్టం చేశారు. ఆర్టీసీకి చెల్లించాల్సిన రూ.3006 కోట్లకు గానూ... ప్రభుత్వం రూ.3903 కోట్లు ఇచ్చిందని పేర్కొన్నారు. ఆర్టీసీయే ప్రభుత్వానికి మోటారు వాహనాల పన్ను కింద రూ.540 కోట్లు చెల్లించాల్సి ఉందని తెలిపారు. వివిధ పద్దుల కింద ఆర్టీసీకి నిధులు విడుదల చేయడం ఆనవాయితీగా వస్తోందని... రుణం పద్దు కింద ఇచ్చిన నిధులు వాస్తవానికి విరాళమేనని ఆర్థికశాఖ ముఖ్యకార్యదర్శి వెల్లడించారు.
మరిన్ని నిధులు రాబట్టాలనే...
రవాణాశాఖ మంత్రికి సెప్టెంబరు 11న ఆర్థికాంశాలు వివరించినట్లు ఆర్టీసీ ఎండీ సునీల్ శర్మ తెలిపారు. మరిన్ని నిధులు రాబట్టాలనే ఉద్దేశంతో సర్కారు నుంచి కొంత సొమ్ము రావాలని చూపించామన్నారు. ఆర్టీసీకి ప్రభుత్వం నుంచి రావల్సిన దాని కంటే రూ.867 కోట్లు ఎక్కువే వచ్చాయన్నారు. రుణం పద్దు కింద విడుదలైన నిధులు, వడ్డీని ప్రభుత్వం ఎప్పుడూ అడగలేదన్నారు. 2018-19లో ఆర్టీసీకి జీహెచ్ఎంసీ ఎలాంటి బకాయి పడలేదని సునీల్ శర్మ నివేదించారు.
నిధులు ఇచ్చే స్థితిలో లేము...
జీహెచ్ఎంసీ ఆర్థిక పరిస్థితిని బట్టి ఆర్టీసీకి సాయం చేశామని కమిషనర్ లోకేశ్ కుమార్ స్పష్టం చేశారు. 2014-15లో మిగులు బడ్టెట్ ఉన్నప్పుడు ఆర్టీసీకి నిధులు ఇచ్చామన్నారు. 2015-16 నుంచి జీహెచ్ఎంసీ లోటు బడ్జెట్‌లోనే కొనసాగుతోందని వెల్లడించారు. చట్టం ప్రకారం ఆర్టీసీకి నిధులు ఇవ్వాల్సిన అవసరం లేదన్నారు. నిధులపై ఆర్టీసీ వినతి అంగీకరించే ఆర్థిక పరిస్థితి లేదని లోకేశ్ కుమార్ తేల్చి చెప్పారు.
ఇదీ చూడండి: వాయుకాలుష్యం ధాటికి మాస్కులు ధరిస్తున్న దేవుళ్లు