రాష్ట్రంలో 11 విశ్వవిద్యాలయాలకు కొత్త ఉపకులపతులు రానున్నారు. వీసీల నియామకం కోసం ప్రభుత్వం పంపిన దస్త్రానికి గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ శుక్రవారం ఆమోదం తెలిపారు. నియామక ఉత్తర్వులను విద్యాశాఖ ఇవాళ జారీచేయనుంది.
విద్యాశాఖ పరిధిలో మొత్తం 11 విశ్వవిద్యాలయాలు ఉండగా.. వాటిలో 10 వర్సిటీలకు గవర్నర్ ఆమోదంతో కొత్త వీసీలు రానున్నారు. బాసరలోని ఆర్జీయూకేటీకి మాత్రం తొలి ఉపకులపతి కావడం వల్ల గవర్నర్ ఆమోదం లేకుండానే సీఎం కేసీఆర్ నేరుగా నియమించవచ్చు.
ఉపకులపతులు ఎంపిక కోసం ఫిబ్రవరిలో అన్వేషణ కమిటీ సమావేశాలు జరిగాయి. ప్రభుత్వం ఒక్కో వర్సిటీకి ముగ్గురేసి సభ్యుల చొప్పున జాబితాను గవర్నకు పంపింది. వాటిలో ఒక్కో పేరుకు గవర్నర్ ఆమోదం తెలిపారు.
కాకతీయ వర్సిటీ విశ్రాంత ఆచార్యుడు కె. సీతారామారావుకు వరుసగా రెండోసారి అవకాశం దక్కనుంది. ఆయన 2016 జులై నుంచి మూడేళ్లపాటు అంబేద్కర్ సార్వత్రిక వర్సిటీకి వీసీగా కొనసాగారు మరోసారి ఆయనే నియమితులు కానున్నారు.
ఓయూకు ఆచార్య రవీందర్ యాదవ్ (ఆర్ట్స్ కళాశాల ప్రిన్సిపల్), జేఎన్టీయూహెచ్కు మహాత్మాగాంధీ వర్సిటీ మాజీ ఉపకులపతి కట్టా నరసింహారెడ్డి, బాసరలోని ఆర్జేయూకేటీకి జేఎన్టీయూహెచ్ రెక్టార్‌గా ఉన్న గోవర్ధన్, తెలంగాణ వర్సిటీకి ఓయూ భౌతిక శాస్త్రం ఆచార్యుడు రవీందర్ గుప్తా. కాకతీయకు ఆ వర్సటీ సోషియాలజీ విభాగం ఆచార్యుడు తాటికొండ రమేశ్, మహాత్మాగాంధీకి ఓయూ రిజిస్ట్రార్ గోపాల్‌రెడ్డి, తెలుగు విశ్వవిద్యాలయానికి ఓయూ తెలుగు విభాగం విశ్రాంత ఆచార్యుడు కిషన్‌రావు, శాతవాహనకు ఉన్నత విద్యామండలి మాజీ ఉపాధ్యక్షుడు మల్లేశం, పాలమూరుకు నిజాం కళాశాల ప్రిన్సిపల్ రాఠోడ్ పేర్లు ఖరారైనట్లు సమాచారం. జేఎన్ఏఎఫ్ఏయూ వీసీ ఎవరనేది తెలియాల్సి ఉంది.
ఇవీచూడండి:విశ్వవిద్యాలయాల్లో వీసీల నియామక దస్త్రంపై గవర్నర్ సంతకం