యాబై మైక్రాన్లలోపు ప్లాస్టిక్ ఉత్పత్తి, వాడకంపై నిషేధం ఉన్నప్పటికీ ఆచరణలో సాధ్యం కావడంలేదు. తొలుత 40 మైక్రాన్ల కంటే తక్కువ మందం ఉన్న ప్లాస్టిక్ ఉత్పత్తిని రాష్ట్ర ప్రభుత్వం నిషేధించింది. ఆ తర్వాత 50 మైక్రాన్లకు పెంచారు. ప్లాస్టిక్ విచ్ఛలవిడి వాడకం వల్ల పర్యావరణానికి కలుగుతున్న నష్టంపై కేంద్రం దృష్టి సారించింది. ఒకసారి వాడిపారేసే ప్లాస్టిక్‌పై నిషేధం విధించాలని తెలంగాణ ప్రభుత్వం భావిస్తోంది. ఆ దిశగా విధివిధానాలు తయారు చేయాలని అధికారులను ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదేశించారు.
70 మైక్రాన్ల వరకు
రాష్ట్ర పర్యావరణశాఖ, కాలుష్య నియంత్రణ మండలి అధికారులు విధివిధానాలపై దృష్టి పెట్టారు. తెలంగాణలో ప్రస్తుతం 50 మైక్రాన్లలోపు ప్లాస్టిక్ తయారీపై నిషేధం ఉంది. మందంతో సంబంధం లేకుండా ఒకసారి వాడిపారేసే ప్లాస్టిక్ ఉత్పత్తిని నిషేధించాలని భావిస్తున్నారు. తెలంగాణ పొరుగు రాష్ట్రాల్లో ప్లాస్టిక్‌పై ఏ మేరకు నిషేధం ఉంది.. ఎక్కడ ఉత్తమ పద్ధతులున్నాయి.. ఇలా పలు అంశాల్ని పరిశీలిస్తున్న అధికారులు వీటిని సీఎంకు వివరించాలని నిర్ణయించినట్లు సమాచారం.