ప్రస్తుత వానాకాలంలో రాష్ట్రంలో వరి సాగు ఇబ్బడిముబ్బడిగా పెరిగింది. దిగుబడి కూడా భారీగా రానుంది. ఈ నేపథ్యంలో బియ్యం తీసుకునే కోటాను పెంచాలని కేంద్ర ప్రభుత్వాన్ని రాష్ట్రం కోరింది. ఈ మేరకు ఆహార, ప్రజాపంపిణీ, వినియోగదారుల వ్యవహారాల మంత్రిత్వశాఖకు పౌరసరఫరాలశాఖ లేఖ (Letter to Central Government) రాసింది.
ఈ సీజనులో తాజా గణాంకాల ప్రకారం 61.75 లక్షల ఎకరాల్లో నాట్లు వేశారు. రాష్ట్రంలో వరి సాధారణ విస్తీర్ణం 34 లక్షల ఎకరాలే. ఈ సారి అదనంగా 28 లక్షల ఎకరాల్లో సాగైంది. ఇటీవల నీరు పుష్కలంగా ఉండటంతో పాటు వర్షాలు బాగా కురుస్తుండటంతో ప్రతి సీజనులోనూ సాధారణ విస్తీర్ణం కన్నా అధిక మొత్తంలోనే ధాన్యం వస్తోంది. ఈసారి అత్యధికంగా 1.38 కోట్ల మెట్రిక్ టన్నుల దిగుబడి వస్తుందని వ్యవసాయశాఖ అంచనా. వానాకాలంలో 40 లక్షల మెట్రిక్ సాధారణ బియ్యం తీసుకుంటామని రాష్ట్ర ప్రభుత్వానికి కేంద్రం ఆహార మంత్రిత్వ శాఖ లేఖ (Letter to Central Government) రాసింది.
వానా కాలంలో వచ్చేది సాధారణ బియ్యమే(రా రైస్). దేశంలోని ఏయే రాష్ట్రం నుంచి ఎంత మొత్తంలో తీసుకునేది సీజను ఆరంభానికి ముందుగానే కేంద్రం వర్తమానం పంపుతుంది. వరి సాగు విస్తీర్ణం భారీగా పెరిగిన నేపథ్యంలో కోటా పెంచాలని రాష్ట్ర ప్రభుత్వం కోరుతోంది. 1.38 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం నుంచి సుమారు 94 లక్షల మెట్రిక్ టన్నుల బియ్యం వస్తాయని... కనీసం 90 లక్షల మెట్రిక్ టన్నులు తీసుకోవాలని రాష్ట్ర ప్రభుత్వం విజ్ఞప్తి చేస్తుంది. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ప్రతి వ్యవసాయ సీజనులో చేసుకునే ఒప్పందంలో సాధారణ బియ్యం ఎంతైనా తీసుకుంటామనే అంశం ఉంటుంది. ప్రస్తుత పరిస్థితుల్లో ఉప్పుడు బియ్యం తీసుకునే అంశంలో కేంద్రం మీనమేషాలు లెక్కిస్తోంది. ఆ బియ్యాన్ని వినియోగించే రాష్ట్రాల్లో సాగు పెరగటంతో పాటు నాలుగేళ్లకు సరిపోయేన్ని నిల్వలున్నాయని చెబుతోంది. ప్రజా పంపిణీ వ్యవస్థ కింద సాధారణ బియ్యాన్ని భారీగా పంపిణీ చేయాల్సి ఉండటంతో డిమాండు ఎక్కువగానే ఉంటుంది. రాష్ట్ర ప్రభుత్వ వినతి(Letter to Central Government) కి కేంద్రం ఎలా స్పందిస్తుందో వేచిచూడాలి.