నాగార్జునసాగర్ ప్రాజెక్టు కుడి, ఎడమ కాలువ ప్రవాహ సామర్థ్యంలో ఉన్న అసమానతలను సవరించాలని కృష్ణానదీ యాజమాన్య బోర్డును తెలంగాణ ప్రభుత్వం కోరింది. ఈ మేరకు కేఆర్‌ఎంబీ (KRISHNA RIVER MANAGEMENT BOARD) ఛైర్మన్‌కు తెలంగాణ నీటిపారుదలశాఖ ఈఎన్సీ (TELANGANA ENGINEER IN CHIEF) మురళీధర్ లేఖ రాశారు.
నీటి విడుదల సామర్థ్యాలు సమానంగా ఉండాలి..
1952లో ఆంధ్ర, హైదరాబాద్ రాష్ట్రాల మధ్య కుదిరిన అంతర్రాష్ట్ర ఒప్పందం ప్రకారం.. ఆంధ్రప్రదేశ్ వైపున్న సాగర్ కుడి కాలువ, తెలంగాణ వైపున్న ఎడమ కాలువ.. హెడ్‌రెగ్యులేటర్ల వద్ద నీటివిడుదల సామర్థ్యాలు సమానంగా ఉండాలని అందులో పేర్కొన్నారు. కానీ 500 అడుగులపైన నీటిమట్టం ఉన్నప్పుడు కుడి కాలువ సామర్థ్యం 11 వేల క్యూసెక్కులు ఉంటే.. ఎడమ కాలువకు మాత్రం 520 అడుగులపైన నీరు ఉంటేనే 11 వేల క్యూసెక్కుల సామర్థ్యం ఉందని లేఖలో తెలిపారు.
సాగర్ కాలువల సామర్థ్యంలో తీవ్రమైన అసమానతలు..
నాగార్జునసాగర్ కనీస నీటి వినియోగస్థాయి అయిన 510 అడుగుల వద్ద.. ఎడమ కాలువ నీటి విడుదల సామర్థ్యం కేవలం 7,899 క్యూసెక్కులు మాత్రమే ఉండగా.. కుడి కాలువ సామర్థ్యం మాత్రం 24,606 క్యూసెక్కులు ఉందని ఈఎన్సీ మురళీధర్ లేఖలో పేర్కొన్నారు. రెండు కాలువల సామర్థ్యంలో తీవ్రమైన అసమానత ఉందని తెలంగాణ ప్రభుత్వం కేఆర్ఎంబీకి (KRMB) తెలిపింది.