యాభై వేల ఉద్యోగాల భర్తీకి సిద్ధమైన రాష్ట్ర ప్రభుత్వం... అంతకు ముందే కొత్త జోనల్ విధానానికి అనుగుణంగా పోస్టుల వర్గీకరణ, ఉద్యోగుల విభజన ప్రక్రియ పూర్తి చేయాలని నిర్ణయించింది. ఆ తర్వాత ఖాళీలను గుర్తించి నియామకాలను చేపట్టాలని ముఖ్యమంత్రి కేసీఆర్ ఇప్పటికే అధికారులను ఆదేశించారు. అందుకు అనుగుణంగా పోస్టుల వర్గీకరణ ప్రక్రియను పూర్తి చేశారు. ఆయా శాఖల్లోని పోస్టులను నూతన జోనల్ విధానం ప్రకారం జిల్లా, జోనల్, మల్టీజోనల్ వారీగా విభజిస్తూ ఇప్పటికే ఉత్తర్వులు జారీ చేశారు. తదుపరి జిల్లాల వారీగా ఆయా పోస్టుల సంఖ్యను నిర్ధారించి కేడర్ స్ట్రెంత్ ఖరారు చేయాల్సి ఉంది.
జనాభా ప్రాతిపదికన కొలువులు ఇవ్వాలి
జనాభా ప్రాతిపదికన పోస్టుల సంఖ్యను ఖరారు చేయాలని ఉద్యోగ సంఘాలు కోరుతున్నాయి. అన్ని శాఖల అవసరాలను గుర్తించి కొత్త పోస్టులు మంజూరు చేయాలని అంటున్నారు. ఆ తర్వాత ఉద్యోగుల విభజనకు మార్గదర్శకాలు జారీ చేసి... వాటికి అనుగుణంగా ఐచ్చికాలు తీసుకొని విభజన ప్రక్రియ పూర్తి చేయాలని కోరుతున్నారు. ఇందుకు సంబంధించి సాధారణ పరిపాలనా శాఖ ఇప్పటికే ముసాయిదా సిద్ధం చేసింది.