అంతా మాస్కులు వాడాల్సిందే - telangana government issued orders for using masks
14:11 April 10
అంతా మాస్కులు వాడాల్సిందే
కరోనా తీవ్రత నేపథ్యంలో మాస్కులు తప్పనిసరి చేస్తూ తెలంగాణ ప్రభుత్వం నిర్ణయం తీసుకొంది. లక్షణాలేవీ కనిపించకుండానే చాలా మందిలో కరోనా పాజిటివ్ నిర్ధరణ అవుతుండడం.. వారు బయట తిరుగుతూ ఇతరులకు వ్యాపింపచేస్తున్నట్లు అధ్యయనంలో తేలింది. దీనిపై అప్రమత్తమైన ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకొన్నట్లు పేర్కొంది. అనారోగ్యంతో ఉన్న వారు మాత్రమే ధరించాలని గతంలో జారీ చేసిన మార్గదర్శకాల్లో మార్పు చేసింది. బయటకు వచ్చినపుడు, కార్యాలయాల్లో, ఇతరులతో మాట్లాడేటప్పుడు తప్పనిసరిగా మాస్కులు ధరించాలని సూచించింది. అన్ని అంశాలను పరిగణనలోకి తీసుకొని ఈ నిర్ణయం తీసుకొన్నట్లు వైద్య ఆరోగ్య శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి శాంతికుమారి పేర్కొన్నారు.
ధరించే ముందు చేతులు కడుక్కోవాలి...
- కార్యాలయాల్లో అందరు ఉద్యోగులు అన్ని వేళల్లో మాస్కు ధరించేలా ప్రోత్సహించాలి. కరోనా నివారణలో భాగంగా పని చేసే విభాగాలకు చెందిన ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా వినియోగించాలి.
- గ్రామీణ ప్రాంతాలకు చెందిన వారు కూడా బయట పని చేసేటప్పుడు వాడాలి.
- ధరించే ముందు చేతులు కడుక్కోవాలి. ఉతికిన దాన్నే వినియోగించాలి.
- మాస్కుకు చెమట పట్టినా, అపరిశుభ్రంగా ఉన్నా వెంటనే మార్చేయాలి.
- మళ్లీ వినియోగించడానికి అవకాశం ఉండే వాటికి మొదటి ప్రాధాన్యం ఇవ్వాలి.
ఇలా శుభ్రం చేయాలి...
- వాడిన తర్వాత సబ్బు నీళ్లు లేదా వేడినీళ్లలో ఉప్పు కూడా వేసి శుభ్రం చేయాలి. కనీసం ఐదు గంటలు ఎండలో ఆరబెట్టాలి. లేదా వేడినీళ్లలో 15 నిమిషాలు ఉడకబెట్టి ఆరిన తర్వాత ఇస్త్రీ చేయాలి. శుభ్రం చేయకుండా ఒకసారి వాడిన దానిని ఇంకోసారి వాడకూడదు.
- తప్పనిసరి పరిస్థితుల్లోనే ఒకసారి వినియోగించి పడేసే(యూజ్ అండ్ త్రో) మాస్కులు వాడాలి. ఇలాంటివి ఆరుగంటలకు ఒకసారి మార్చి మూత ఉన్న డస్ట్‌బిన్‌లో వేయాలి.
- మాస్కులు ధరించడం అనేది వ్యక్తిగత దూరం పాటించడం, చేతులు కడుక్కోవడం, ముఖం మీద చేతులు పెట్టుకోకుండా ఉండటం లాంటి చర్యలకు ప్రత్యామ్నాయం కాదు.
ఇదీ చూడండి:భారత్‌కు ఏడీబీ 220 కోట్ల డాలర్ల సాయం