తెలంగాణ

telangana

ETV Bharat / state

సౌకర్యాలే కాదు.. విద్యానాణ్యతపై కూడా సర్కారు దృష్టి - ప్రభుత్వ పాఠశాలల్లో మౌలిక వసతులు

ప్రభుత్వ పాఠశాలల్లో మౌలిక సౌకర్యాలు మెరుగుపరిచేందుకు రాష్ట్ర ప్రభుత్వం తాజా బడ్జెట్‌లో రూ.2వేల కోట్లు కేటాయించింది. వీలైనంత త్వరగా ఆ పనులు పూర్తి చేసేందుకు ప్రణాళికలు సిద్ధం చేస్తోంది. కేవలం సౌకర్యాలే కాకుండా విద్యానాణ్యత కూడా పెంచేలా సన్నాహాలు చేస్తుంది.

telangana-government-is-preparing-to-improve-infrastructure-in-public-schools
సౌకర్యాలు+విద్యా నాణ్యత

By

Published : Apr 12, 2021, 8:29 AM IST

సర్కారు బడుల బాగుకు మౌలిక వసతులు పెంచేందుకు రూ.2 వేల కోట్లను బడ్జెట్‌లో కేటాయించిన ప్రభుత్వం ఆ పథకం ద్వారా విద్యానాణ్యతను మెరుగుపరచడం కూడా లక్ష్యంగా పెట్టుకుంది. ఆంధ్రప్రదేశ్‌లో నాడు-నేడు పేరిట పాఠశాలల్లో మౌలిక వసతులను కల్పిస్తున్న నేపథ్యంలో అక్కడి పరిస్థితిని అధ్యయనం చేసేందుకు ఇటీవల పాఠశాల విద్యాశాఖకు చెందిన మూడు బృందాలు పర్యటించి వచ్చాయి. పాఠశాలలను స్వయంగా పరిశీలించడమే కాకుండా అక్కడి సర్వశిక్ష అభియాన్‌ అధికారులతో చర్చించాయి. అనంతరం రాష్ట్రానికి వచ్చిన బృందాలు ఒక నివేదిక రూపొందించి అయిదుగురు మంత్రుల ఉప కమిటీతో జరిగిన సమావేశంలో పవర్‌ పాయింట్‌ ప్రజెంటేషన్‌ ఇచ్చాయి. కేవలం సౌకర్యాలు కాకుండా విద్యానాణ్యత పెంచడం కూడా పథకం లక్ష్యం కావాలని ఈ సందర్భంగా మంత్రి కేటీఆర్‌ వారిని ఆదేశించారు. అంటే చదువు వస్తుందా? లేదా? అన్నది కూడా ప్రధానం. ఈక్రమంలో దాన్ని మెరుగుపరిచేందుకు అధికారులు ప్రణాళిక తయారుచేస్తున్నట్లు తెలిసింది. ఇప్పటివరకు వసతులు లేవని ఉపాధ్యాయులు, ప్రజలు అంటుండేవారు. వాటిని కల్పిస్తే తర్వాత దృష్టంతా విద్యానాణ్యతపైనే ఉంటుంది కదా? అని ఒక అధికారి అభిప్రాయపడ్డారు.


త్వరలో పథకానికి పేరు..

మొదటి విడతలో 30-35 శాతం పాఠశాలలను ఈ పథకం కింద ఎంపిక చేసి అభివృద్ధి చేయాలని భావిస్తున్నారు. రాష్ట్రంలో విద్యాశాఖ పరిధిలో 25 వేల పాఠశాలలు ఉండగా మూడో వంతు అంటే 8 వేల బడుల వరకు ఎంపిక చేయవచ్చని తెలుస్తోంది. శౌచాలయాల్లో టైల్స్‌, భవనాలకు రంగులు, అత్యవసరమైన చోట అదనపు తరగతి గదుల నిర్మాణం లాంటి 11 రకాల పనులను చేపట్టాలని భావిస్తున్నారు. ఏడాదికి రూ.2 వేల కోట్ల చొప్పున 2021-22, 2022-23 ఆర్థిక సంవత్సరాల్లో మొత్తం రూ.4 వేల కోట్లు రాష్ట్ర ప్రభుత్వం ఖర్చు చేయనుంది. త్వరలో పథకానికి నామకరణం చేయనున్నారు.

ఇదీ చూడండి:కేటీఆర్‌ సార్‌ మీరు సినిమాల్లో ట్రై చేయలేదా?

ABOUT THE AUTHOR

...view details