పట్ణణ ప్రాంతాల సమగ్ర, ప్రణాళికాబద్ధ అభివృద్ధితోపాటు ఆర్థిక స్వయం సమృద్ధి లక్ష్యంగా ప్రభుత్వం ల్యాండ్ పూలింగ్ (Land pooling) విధానాన్ని అమలు చేసేందుకు సిద్ధమైంది. ఇటీవల జరిగిన మంత్రివర్గ సమావేశంలో ఇందుకు సంబంధించి విస్తృతంగా చర్చించారు. గృహ నిర్మాణాల కోసం అభివృద్ధి చేసే లేఅవుట్లలో... ల్యాండ్ పూలింగ్ విధానాన్ని అమలు చేసే అంశంపై చర్చ జరిగింది. ఇందుకు సంబంధించిన అవకాశాలను అన్వేషించాలని, విధివిధానాలను రూపొందించాలని పురపాలకశాఖను కేబినెట్ ఆదేశించింది.
కొన్నాళ్లుగా...
అందుకు అనుగుణంగా పురపాలకశాఖ కొన్నాళ్లుగా కసరత్తు చేస్తోంది. తొలుత 20 పట్టణాల్లో ల్యాండ్ పూలింగ్ విధానాన్ని చేపట్టాలనే ఆలోచనలో సర్కార్ ఉంది. మొదట నగరపాలికలు, పట్టణాభివృద్ధి సంస్థలు, జిల్లా కేంద్రాల్లో ఈ విధానాన్ని అమలు చేస్తే బాగుంటుందన్న భావనతో ప్రభుత్వం ఉంది. అవకాశం ఉన్న చోట ప్రభుత్వ భూములు, ఆ తర్వాత అసైన్డ్ సహా ఇతర సమస్యలున్న భూములను ఇందుకోసం వినియోగిస్తే బాగుంటుందన్న అభిప్రాయం ఉంది.
ఇతర రాష్ట్రాల విధానాలు...
ల్యాండ్ పూలింగ్ విధానాన్ని విజయవంతంగా అమలు చేసిన ఇతర రాష్ట్రాల విధానాలను కూడా పురపాలకశాఖ అధ్యయనం చేస్తోంది. ముంబయి సమీపంలోని ధారవి ప్రాంతంలో ఈ విధానం పూర్తిగా సఫలమైందని అంటున్నారు. గుజరాత్, తమిళనాడులోనూ కొన్ని చోట్ల మంచి ఫలితాలను ఇచ్చిందని చెబుతున్నారు. వీటన్నింటిని దృష్టిలో ఉంచుకొని రాష్ట్రంలో మరింత పకడ్బందీగా ల్యాండ్ పూలింగ్, మానెటైజేషన్ విధానాన్ని తీసుకొచ్చేందుకు ప్రభుత్వం సిద్ధమవుతోంది. అందులో భాగంగా ఇవాళ పురపాలకశాఖ కార్యశాల నిర్వహించనుంది.
ల్యాండ్ పూలింగ్, మానెటైజేషన్ విధానంలో అందులో పట్టణ ప్రణాళికా విభాగాల పాత్రపై ఆస్కి ఆధ్వర్యంలో సదస్సు ఏర్పాటు చేశారు. జాతీయ స్థాయి నిపుణులతోపాటు మహారాష్ట్ర, గుజరాత్, తమిళనాడులో సంబంధిత విధానాలపై పనిచేసినవారు ఇందులో పాల్గొననున్నారు. పురపాలకశాఖ మంత్రి కేటీఆర్‌తో పాటు ఉన్నతాధికారులు, ఆయా విభాగాల అధికారులు కార్యశాలలో పాల్గొంటారు.
మొదటి దశలో 100 ఎకరాలు...
ల్యాండ్ పూలింగ్‌లో మంచి విధానాలు, పట్టణప్రణాళికా సంస్థల పాత్ర, ల్యాండ్ పూలింగ్ విధానంలో ఎదురైన అనుభవాలు తదితర అంశాలపై సదస్సులో చర్చిస్తారు. ఉత్తమ విధానాలను స్వీకరించి ఆయా ప్రాంతాల్లో ఎదురైన అనుభవాలను పరిగణలోకి తీసుకొని రాష్ట్రంలో మంచి ల్యాండ్ పూలింగ్ విధానాన్ని అమలు చేయాలని ప్రభుత్వం భావిస్తోంది. మొదటి దశలో కనీసం వంద ఎకరాల మేర ఈ విధానాన్ని అమలు చేసి... ఫలితాల ఆధారంగా మిగతా ప్రాంతాలకు విస్తరించాలని సర్కార్ భావిస్తోంది.
ఇదీ చదవండి:Ganja smuggling: చేపల లారీల్లో... రూ.7.30 కోట్ల విలువైన గంజాయి