Omicron Covid Variant: కరోనా మూడో దశ (Third Wave) ముప్పు తలెత్తితే ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉన్నట్లు రాష్ట్ర ప్రభుత్వం తెలిపింది. అన్ని ఏర్పాట్లు చేసినట్లు వెల్లడించింది. దేశంలో, రాష్ట్రంలో ఒమిక్రాన్ కేసు (Omicron Covid Variant Cases) నమోదు కాలేదని స్పష్టం చేసింది. వ్యాక్సిన్ తీసుకున్న వారికి ముప్పు తగ్గుతుందని, ప్రాణాలు కాపాడుకునేందుకు అందరూ టీకాలు తీసుకోవాలని స్పష్టం చేసింది. రెండు డోసులు పూర్తిచేసుకున్న ఆరు నెలలకు బూస్టర్‌డోసు అవసరమని, దీనిపై కేంద్ర మార్గదర్శకాలు వచ్చేవరకు ప్రజలు వేచి ఉండాలని కోరింది. ప్రపంచదేశాలను వణికిస్తున్న ఒమిక్రాన్ వేరియంట్ ప్రభావం, ఎదుర్కొనేందుకు తీసుకోవాల్సిన చర్యలపై మంత్రి హరీశ్‌రావు ఆదివారమిక్కడ వైద్యశాఖ ఉన్నతాధికారులతో సుదీర్ఘంగా సమీక్ష నిర్వహించారు. ఈ వివరాలను ప్రజారోగ్యశాఖ సంచాలకులు శ్రీనివాస్‌రావు, వైద్యవిద్య సంచాలకులు రమేష్‌రెడ్డి వెల్లడించారు. ప్రజలు మాస్కు ధారణ, భౌతిక దూరం, వ్యక్తిగత పరిశుభ్రత తప్పనిసరిగా పాటించాలన్నారు. ఒమిక్రాన్ ప్రభావంపై స్పష్టమైన అవగాహన రావడానికి మరో రెండు వారాల సమయం పడుతుందని.. క్రిస్మస్, కొత్త ఏడాది, సంక్రాంతి వేడుకల్లో ప్రతిఒక్కరూ జాగ్రత్తలు తీసుకోవాలని (Omicron Covid Variant Alert) సూచించారు.
విమానాశ్రయాల్లో పరీక్షిస్తున్నాం
ఒమిక్రాన్ వేరియంట్ దక్షిణాఫ్రికా, బోట్స్‌వానా, హాంగ్‌కాంగ్‌లలో బయటపడింది. ఈ నేపథ్యంలో విదేశాల నుంచి వచ్చే ప్రయాణికులపై దృష్టిపెట్టాం. రెండు డోసుల టీకా తీసుకున్నవారిని ఇంటికి పంపించి, క్వారంటైన్ చేస్తున్నాం. టీకా తీసుకోని, పాక్షికంగా తీసుకున్నవారికి పరీక్షలు నిర్వహించి, పాజిటివ్ వస్తే ఆసుపత్రికి తరలించి, వైరస్ జీనోమ్ విశ్లేషణకు సీడీఎఫ్‌డీకి పంపిస్తున్నాం.
డెల్టాతో పోల్చితే 30 రెట్ల తీవ్రత (Omicron is More Dangerous Than DELTA )!
కరోనా వైరస్‌లో ఇప్పటికే 3.5 లక్షల నుంచి 4 లక్షల మ్యుటేషన్లు జరిగాయి. కొన్ని బలహీనంగా ఉంటే.. మరికొన్ని బలంగా ఉంటాయి. డెల్టా కన్నా ఒమిక్రాన్ తీవ్రత 30 రెట్లు ఎక్కువగా ఉంటుందని శాస్త్రవేత్తలు అభిప్రాయపడుతున్నారు. దేశంలోకి ఈ వైరస్ చేరకుండా జాగ్రత్తపడుతూ తక్కువ నష్టంతో బయటపడాలి. లక్షణాలు కనిపిస్తే వెంటనే పరీక్షలు చేయించుకోవాలి.
పిల్లల్ని పాఠశాలలకు పంపించవచ్చు..
శీతాకాలంలో కరోనాతో పాటు ఇతర వైరస్‌లు విజృంభిస్తాయి. ప్రజలు అప్రమత్తంగా ఉండాలి. తల్లిదండ్రులు స్వీయ జాగ్రత్తలు తీసుకుంటూ పిల్లలను నిరభ్యంతరంగా పాఠశాలలకు పంపించవచ్చు. అక్కడక్కడ పిల్లలకు కరోనా సోకుతున్నా.. వ్యాధి తీవ్రం కావడం లేదు. కరోనా నిర్ధారణ అయిన పిల్లలను ఒంటరిగా ఉంచాలి’’ అని డాక్టర్ శ్రీనివాస్‌రావు సూచించారు.