Telangana Government Interduce Praja Palana Scheme: పరిపాలనను గ్రామ స్థాయిలోకి తీసుకెళ్లేందుకు ప్రభుత్వం కొత్తగా ‘ప్రజా పాలన’ కార్యక్రమానికి శ్రీకారం చుట్టనుంది. ఈ నెల 28 నుంచి జనవరి 6 వరకు పది రోజుల పాటు ఈ కార్యక్రమం నిర్వహించేందుకు కార్యాచరణ సిద్ధం చేస్తోంది. జిల్లా కలెక్టర్ నేతృత్వంలో ప్రత్యేక యంత్రాంగం గ్రామ స్థాయిలో సదస్సులు నిర్వహించి, ప్రజల సమస్యలను నేరుగా విని అక్కడికక్కడ పరిష్కరించాలనేది ఈ కార్యక్రమం ప్రధాన ఉద్దేశాలలో ఒకటని తెలిసింది.
Telangana Praja Palana Scheme Details: ప్రస్తుతం హైదరాబాద్‌లో మహాత్మా జ్యోతిభా ఫూలే ప్రజాభవన్(Mahatma Jyotiba Phule Praja Bhavan)లో నిర్వహిస్తున్న ప్రజావాణి కార్యక్రమానికి వస్తున్న దరఖాస్తులను పరిశీలించిన ప్రభుత్వం, వాటిలో చాలా వినతులు గ్రామస్థాయి సమస్యలకు సంబంధించినవేనని గుర్తించింది. ఈ క్రమంలోనే కొత్త కార్యక్రమం రూపకల్పనకు శ్రీకారం చుట్టినట్లు తెలిసింది. గ్రామ, మండల స్థాయిల్లో సమస్యలకు పరిష్కారం లభించేలా చూడాలనే ఉద్దేశంతోనే ప్రభుత్వం ఈ కార్యక్రమాన్ని చేపడుతున్నట్లు తెలుస్తోంది. అక్కడ సాధ్యం కానివే ఆపై స్థాయులకు రావాలని, ఇందుకోసం హైదరాబాద్‌లో ప్రజావాణి నిరాటంకంగా కొనసాగించాలని భావిస్తున్నారు.
ప్రజావాణికి భారీ స్పందన- ప్రజాభవన్‌కు బారులు తీరిన ప్రజలు
Praja Palana Scheme From December 28 :గ్రామ స్థాయిలో విద్య, వైద్యం, భూ సమస్యలకు శాశ్వత పరిష్కారం చూపాలని నిర్ణయించినట్లు తెలిసింది. తొలుత పది రోజుల పాటు గ్రామస్థాయిలో ‘ప్రజా పాలన(PrajaPalana)’ పెద్ద ఎత్తున నిర్వహించాలని నిర్ణయించారు. ఆ తరువాత వారానికి రెండు రోజులు లేదా నెలలో కొన్ని రోజులు నిర్వహించడంపై కసరత్తు జరుగుతోంది. జిల్లా కలెక్టర్ గ్రామాలకు వెళ్లి నేరుగా ప్రజల గోడు విని అక్కడికక్కడే ఉత్తర్వులు జారీ చేసేలా ఈ కార్యక్రమం ఉంటుందని పేర్కొంటున్నారు. ముఖ్యమంత్రితో పాటు మంత్రులు, విప్‌లు, ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఎమ్మెల్సీలు కూడా ఈ కార్యక్రమంలో భాగస్వాములయ్యేలా షెడ్యూల్ ఉంటుందని తెలిసింది.