Telangana Irrigation Projects : కేంద్ర ప్రభుత్వంపై రాష్ట్ర సర్కారు మరోసారి అసహనం వ్యక్తం చేసింది. సాగు నీటి ప్రాజెక్టుల అంశంలో కేంద్ర తీరును తప్పుబట్టింది. ఈ మేరకు కేంద్ర జలశక్తి శాఖ కార్యదర్శి పంకజ్ కుమార్‌కు.. రాష్ట్ర నీటిపారుదల శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి రజత్ కుమార్ లేఖ రాశారు. ఇందులో పాలమూరు - రంగారెడ్డి ప్రాజెక్టు అంశాన్ని ప్రధానంగా పేర్కొన్నారు.
Telangana Letter to Centre over Palamuru Rangareddy project : కేటాయింపులకు లోబడే పాలమూరు - రంగారెడ్డి ఎత్తిపోతల పథకం చేపట్టామని రాష్ట్ర ప్రభుత్వం స్పష్టం చేసింది. పోలవరం నుంచి కృష్ణా డెల్టాకు తరలించే 80 టీఎంసీలకు బదులుగా.. సాగర్ ఎగువన ఉన్న రాష్ట్రాలు 80 టీఎంసీల కృష్ణా జలాలు వాడుకోవచ్చని గోదావరి ట్రైబ్యునల్ ఇచ్చిన తీర్పును ప్రస్తావించింది. ఈ మేరకు వచ్చే 45 టీఎంసీలు, చిన్న నీటిపారుదలలో మిగిలిన 45 టీఎంసీలు కలిపి 90 టీఎంసీలతో పాజెక్టును చేపట్టామని లేఖలో పేర్కొంది. అయితే ప్రాజెక్టుకు నీటి కేటాయింపులు కోర్టు పరిధిలో ఉన్నాయంటూ డీపీఆర్ వెనక్కి పంపించడంలో కేంద్రం అంతర్యం ఏమిటని రజత్ కుమార్ ప్రశ్నించారు. కర్ణాటకలో అప్పర్ భద్ర ప్రాజెక్టును కూడా ఇదే తరహాలో చేపట్టారని గుర్తు చేశారు.
Palamuru Rangareddy project Issue : చిన్ననీటిపారుదలలో మిగిలిన జలాలు, పోలవరం నుంచి కృష్ణా డెల్టాకు తరలించిన వాటాలో వచ్చే జలాల ఆధారంగా అప్పర్ భద్రను ప్రతిపాదించారని రజత్ కుమార్ అన్నారు. కేంద్రం ఆ ప్రాజెక్టుకు అనుమతులు ఇవ్వడమే కాకుండా ఏకంగా జాతీయ హోదా కల్పించి, కేంద్ర బడ్జెట్లో నిధులు కూడా కేటాయించిందని పేర్కొన్నారు. కరవు పీడిత, ఫ్లోరైడ్ ప్రభావిత ప్రాంతాలలో 1200 గ్రామాలకు తాగునీరు, ఆరు జిల్లాల్లో 12 లక్షలకు పైగా ఎకరాలకు సాగునీరు అందించేందుకు ప్రతిపాదించిన పాలమూరు - రంగారెడ్డికి మాత్రం ఎందుకు అన్యాయం చేస్తున్నారని లేఖలో నిలదీశారు. నీటి పారుదల ప్రాజెక్టుల అనుమతి విషయంలో ఒక్కో రాష్ట్రానికి.. ఒక్కోలా వ్యవహరిస్తారా అని ప్రశ్నించారు.