హరితహారం.. రాష్ట్రమంతటా పచ్చదనం పరిఢవిల్లడమే లక్ష్యంగా ప్రతిష్ఠాత్మకంగా చేపడుతున్న కార్యక్రమానికి ప్రభుత్వం ఖర్చు కూడా భారీగానే చేస్తోంది. 2015-16లో ‘తెలంగాణకు హరితహారం’ ప్రారంభమైంది. 2020-21 నాటికి ఆరు దశలు పూర్తయ్యాయి. ఆరేళ్లలో రాష్ట్ర ప్రభుత్వం చేసిన ఖర్చు రూ.5,300 కోట్లు దాటింది. రాష్ట్రవ్యాప్తంగా 14,926 నర్సరీల్లో మొక్కలు పెంచుతున్నారు. ప్రభుత్వ లక్ష్యం 230 కోట్ల మొక్కలు నాటడం. 2020 నాటికే దీన్ని పూర్తి చేయాల్సి ఉన్నా ఇంకా చేరుకోలేదు. ఇప్పటివరకు 210.83 కోట్ల మొక్కలు నాటారు. మరో 6.55 కోట్ల మొక్కల్ని సరఫరా చేసినా నాటలేదు. వచ్చే వానాకాలంలో ఏడో విడత కార్యక్రమం మొదలుకానుంది. ఇందులో 19.86 కోట్ల మొక్కలు నాటాలని లక్ష్యంగా పెట్టుకున్నారు.
రూ.700 కోట్లతో పట్టణ అటవీ ఉద్యానవనాలు
నగర, పట్టణవాసులకు స్వచ్ఛమైన గాలి అందించేందుకు రూ.700 కోట్ల వ్యయంతో రిజర్వు ఫారెస్టు బ్లాకుల్ని 109 పట్టణ ఉద్యానవనాలుగా అభివృద్ధి చేస్తున్నారు. ఇప్పటివరకు 35 అందుబాటులోకి వచ్చాయి. రూ.309.07 కోట్ల ఖర్చయింది. మిగిలినవి 2021-22లో అందుబాటులోకి వస్తాయని అటవీశాఖ తెలిపింది.