తెలంగాణ

telangana

ETV Bharat / state

ఆక్సిజన్‌ తరలింపునకు రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక వ్యవస్థ ఏర్పాటు - ఆక్సిజన్ సరఫరా ఎలా జరుగుతుందంటే

కరోనాతో తీవ్రంగా బాధపడుతూ... ప్రాణవాయువు అవసరమైన వారికి రాష్ట్ర ప్రభుత్వం సకాలంలో ఆక్సిజన్‌ను అందించేందుకు ప్రత్యేక వ్యవస్థను ఏర్పాటు చేసింది. హైదరాబాద్​ నగరంలోని గాంధీ, కింగ్ కోఠీ, టిమ్స్, ఛాతీ అసుపత్రులకు... అవసరమైన ప్రాణవాయువును క్షణం కూడా ఆలస్యం కాకుండా... అందించేందుకు ఈ వ్యవస్థ అహర్నిశలు శ్రమిస్తోంది. అటు వాయు మార్గంలోనూ ఆక్సిజన్ టాంకర్లు తెప్పించి ప్రజల ప్రాణాలకు అండగా నిలుస్తుంది.

telangana-government-has-set-up-a-special-system-for-the-evacuation-of-oxygen
ఆక్సిజన్‌ తరలింపునకు రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక వ్యవస్థ ఏర్పాటు

By

Published : May 22, 2021, 10:24 AM IST

ఆక్సిజన్‌ తరలింపునకు రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక వ్యవస్థ ఏర్పాటు

ఈ నెల 9వ తేదీన కింగ్ కోఠీ ఆసుపత్రిలో ఆక్సిజన్ సరఫరా తగ్గడంతో.. ఐదుగురు చనిపోయిన దృష్ట్యా రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఆక్సిజన్ సమకూర్చేందుకు ఓ ప్రత్యేక వ్యవస్థను రూపొందించింది. పదకొండు రోజుల నుంచి ఈ ప్రత్యేక వ్యవస్థ పనిచేస్తోంది. రోడ్డు, రైలు మార్గాల ద్వారా... ఆక్సిజన్ సిలిండర్లను ఆసుపత్రులకు సరైన సమయంలో అందజేస్తోంది. ఒడిశా, గుజరాత్ రాష్ట్రాల నుంచి ఆక్సిజన్ ట్యాంకర్లు బయలుదేరినప్పటి నుంచి ఇక్కడికి వచ్చేంతవరకూ.. ట్యాంకర్ల ప్రయాణాన్ని నగర ట్రాఫిక్ అదనపు సీపీ అనిల్ కుమార్ పర్యవేక్షిస్తున్నారు. ట్యాంకర్ల సాఫీ రవాణా కోసం రహదారులపై ఎక్కడా ఆగకుండా... గ్రీన్ ఛానెల్​ను ఏర్పాటు చేశారు.

ప్రమాదాలు జరిగే అవకాశం

మరో వైపు ప్రాణవాయువు కొరత కారణంగా.. రోగులు మరణించకూడదన్న లక్ష్యంతో సర్కార్ వేగంగా ఆక్సిజన్ ట్యాంకర్లను తెప్పించేందుకు విమానాలను ఎంచుకుంది. హైదరాబాద్ బేగంపేట విమానాశ్రయం నుంచి ఖాళీ క్రయోజనిక్ ట్యాంకర్లను... ప్రభుత్వ అధికారులు విమానాల్లో పంపిస్తున్నారు. నిండు ట్యాంకర్లను ఒడిశాలోని టాటాస్టీల్ ప్లాంట్ నుంచి హైదరాబాద్​కు తీసుకువచ్చేందుకు.. ఖాళీ ట్యాంకర్లతోపాటు ఆర్టీసీ డ్రైవర్ ఒకరు, ఒక ప్రైవేటు డ్రైవర్​ను విమానంలో పంపుతున్నారు. విమానం ద్వారానే ఆక్సిజన్ నింపుకొని వస్తే సమయం ఆదా అవుతుందని అనుకున్నా... గాల్లో విమానం కుదుపుల వల్ల ప్రమాదం జరిగే అవకాశాలున్నాయని నిపుణులు హెచ్చరించడంతో.. రోడ్డు, రైలు మార్గాలను ఎంచుకున్నారు.

వివరాలు ఎప్పటికప్పుడు తెలుసుకుంటూ..

గూడ్స్ రైల్లో నేరుగా ట్రక్కులను ఎక్కించడం.. కేవలం ఖాళీ ట్యాంకర్లను పంపి వాటిని నింపి తిరిగి తీసుకువస్తున్నారు. సనత్ నగర్, మూసాపేట రైల్వేస్టేషన్లలో.. ట్యాంకర్లను దింపి ప్రభుత్వ, ప్రైవేటు ఆసుపత్రులకు పంపుతున్నారు. ఒడిశా, గుజరాత్, జడ్చర్ల నుంచి సర్కార్ ఆక్సిజన్ సిలిండర్లను కొనుగోలు చేస్తోంది.. ఒడిశా, గుజరాత్​ల నుంచి ట్యాంకర్లు బయలుదేరగానే డ్రైవర్లు హైదరాబాద్​లోని పోలీస్ అధికారులకు సమాచారం ఇస్తారు. అప్పటి నుంచి ట్యాంకర్లకు జీపీఎస్ పనిచేస్తుంది. డ్రైవర్లు ఫోన్ చేసిన సమయం ఆధారంగా.. పోలీస్ అధికారులు ట్యాంకర్ ఎక్కడుంది? ప్రయాణిస్తోందా ? లేదా ? అనే వివరాలను.. ఎప్పటికప్పుడు తెలుసుకుంటున్నారు. సూర్యాపేటకు ట్యాంకర్ చేరుకోగానే ముందూ, వెనుక పోలీస్ వాహనాలు ఎస్కార్ట్​గా ఉంటాయి. పెద్దఅంబర్​పేట బాహ్యవలయ కూడలికి రాగానే.. హైదరాబాద్ పోలీసులు రెండు వాహనాల్లో వెళ్లి ట్యాంకర్లను నేరుగా ఆసుపత్రులకు లేదా మేడ్చల్, మల్కాజిగిరి, చర్లపల్లిలోని ప్రాణవాయువు నిల్వల కేంద్రాలకు తీసుకెళ్తారు. అక్కడి నుంచి చిన్న, చిన్న సిలిండర్లను నింపి ఆసుపత్రులకు పంపుతున్నారు.

సాధ్యమైనంత వేగంగా

జడ్చర్లలోని ఓ ప్రైవేటు పరిశ్రమలో తయారైన... ప్రాణవాయువును హైదరాబాద్, సైబరాబాద్ పోలీసులు సంయుక్తంగా పర్యవేక్షించి ట్యాంకర్ల గమ్యస్థానాలను చేర్చుతున్నారు. అత్యవసరంగా ఫలానా ఆసుపత్రికి అవసరం అంటూ సమాచారం రాగానే.. అక్కడికి పంపుతున్నారు. ప్రాణవాయువు ట్యాంకర్లు ఎక్కడైనా ఆగిపోయినా, బ్రేక్ డౌన్ అయినా, మరమ్మతులున్నా ట్రాఫిక్ ఏసీపీ ఆదిమూర్తి, ఇన్ స్పెక్టర్ హరీశ్​ వేగంగా స్పందించి అక్కడున్న పోలీసులతో... సమయన్వయం చేసుకుని సాధ్యమైనంత వేగంగా మరమ్మతులు చేయించి ట్యాంకర్లను సురక్షితంగా ఆసుపత్రులకు చేర్చుతున్నారు.

ఇదీ చూడండి:అనాథలైన అక్కాచెల్లెల్లు... సాయం కోసం కన్నీళ్లతో ఎదురుచూపులు

ABOUT THE AUTHOR

...view details