Telangana Government Letter To NWDA: మహానది - గోదావరి నదుల అనుసంధానం పూర్తయ్యాకే గోదావరి - కావేరీ లింక్ చేపట్టాలని తెలంగాణ ప్రభుత్వం స్పష్టం చేసింది. ఇటీవల జరిగిన జాతీయ నీటి అభివృద్ధి సంస్థ పాలకమండలి 70వ సమావేశంలో జరిగిన చర్చ నేపథ్యంలో తెలంగాణ ప్రభుత్వం తన అభిప్రాయాన్ని తెలిపింది. ఈ మేరకు ఎన్‌డబ్ల్యూడీఏ చీఫ్ ఇంజనీర్‌కు తెలంగాణ నీటిపారుదలశాఖ ఈఎన్సీ మురళీధర్ లేఖ రాశారు. సంప్రదింపుల సమావేశం అనంతరం తెలిపిన అభిప్రాయాలకు కొనసాగింపుగా గోదావరి - కావేరీ నదుల అనుసంధాన ప్రతిపాదనలో ఉన్న అంశాలను లేఖలో ప్రస్తావించారు.
ఇచ్చంపల్లి వద్ద ఆనకట్ట నిర్మించాలని ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లోనే ప్రతిపాదించారని.. అయితే తమ రాష్ట్రాల్లో ముంపు సమస్య వస్తుందని మహారాష్ట్ర, ఛత్తీస్‌గఢ్ అప్పుడే అభ్యంతరం తెలిపాయని అందులో పేర్కొన్నారు. ప్రతిపాదిత ఇచ్చంపల్లి ఛత్తీస్‌గఢ్ సరిహద్దుకు సమీపంగా ఉన్నందున మళ్లీ అక్కడినుంచి అభ్యంతం రావచ్చని తెలిపింది. ఇచ్చంపల్లికి దిగువన 24 కిలోమీటర్ల దూరంలో ఇప్పటికే సమ్మక్కసాగర్ ఆనకట్ట నిర్మాణం జరిగిందని.. మరో భారీ ఆనకట్ట నిర్మిస్తే వరద ప్రవాహం సహా ఇతర ఇబ్బందులు ఉంటాయని తెలంగాణ పేర్కొంది.
ఇచ్చంపల్లి దిగువన తెలంగాణ రాష్ట్రానికి 158 టీఎంసీల మేర నీటి అవసరాలున్నాయని.. ఆనకట్ట కడితే వాటిపై ఆ ప్రభావం పడుతుందని ఆందోళన వ్యక్తం చేసింది. రాష్ట్ర అవసరాలు తీరాకే నీటి మళ్లింపు జరగాలని స్పష్టం చేసింది. అటు గోదావరి నదిలో 75 శాతం లభ్యత ప్రకారం మిగులు జలాలు లేవని కేంద్ర జలసంఘం, ఎన్‌డబ్ల్యూడీఏ ఇప్పటికే తేల్చాయన్న తెలంగాణ.. ఇచ్చంపల్లి నుంచి ప్రతిపాదిత గోదావరి - కావేరీ లింక్ సాధ్యం కాదన్న పేర్కొంది.