Land Values in TS: రాష్ట్రంలో ఇక ప్రతి ఏడాదీ వ్యవసాయ, వ్యవసాయేతర ఆస్తుల మార్కెట్ విలువలు పెరగనున్నాయి. ఈ మేరకు సర్కారు ఉత్తర్వులు జారీ చేసింది . స్టాంపులు, రిజిస్ట్రేషన్ శాఖ కమిషనర్‌కు అధికారం కల్పించింది. ఆర్థిక వనరులను పెంచుకునేందుకు ప్రభుత్వం ఈ దిశగా చర్యలు చేపట్టింది. రాబడి పెంచుకునే మార్గాలపై ప్రభుత్వం ఏర్పాటు చేసిన మంత్రి మండలి ఉపసంఘం కూడా ఈ మేరకు ప్రతిపాదనలు చేసింది. ఏడేళ్లుగా మార్కెట్ విలువలను సవరించకపోవడంతో రాష్ట్ర రాబడికి నష్టం జరిగిందని భావించారు. గత ఏడాది పెంచిన మార్కెట్ విలువకు.. బహిరంగ మార్కెట్లో జరుగుతున్న క్రయ విక్రయాలకు చాలా అంతరం ఉందని గుర్తించారు. అందుకే ఒకే ఆర్థిక సంవత్సరంలో రెండోసారి మార్కెట్ విలువ సవరణ ప్రక్రియ చేపట్టారు. ప్రతి రెండేళ్లకు ఒకసారి మార్కెట్ విలువలను సవరించేలా గతంలో ఉత్తర్వులు ఉండగా.. తాజాగా వాటిని సవరించారు.
ప్రాతిపదికకు పలు అంశాలు
- ఎనిమిదేళ్లుగా భూముల విలువను సవరించకపోవడం, రాష్ట్ర స్థూల ఉత్పత్తి (జీఎస్‌డీపీ), తలసరి ఆదాయం రెట్టింపు కావడం, సాగునీటి ప్రాజెక్టులతో నీటి వసతి పెరగడంతో భూముల విలువ భారీగా పెరగడం, రాష్ట్రంలో ఐటీ, ఫార్మా, పర్యాటకం, స్థిరాస్తి రంగంలో పెరుగుదల, కొత్త జిల్లాల ఏర్పాటు, వివిధ రంగాల్లో అభివృద్ధి తదితర అంశాలను పరిగణనలోకి తీసుకుంది.
- హైదరాబాద్ చుట్టుపక్కల ఔటర్ రింగ్ రోడ్డుకు అటు ఇటు, తాజాగా వస్తున్న రీజనల్ రింగ్‌రోడ్డు నేపథ్యంలో వేగంగా జరుగుతున్న అభివృద్ధిని దృష్టిలో పెట్టుకుంది.
- మౌలిక సదుపాయాల కల్పనతో జరుగుతున్న అభివృద్ధి, హైదరాబాద్ నలుదిశలా పెరుగుతున్న రియల్ ఎస్టేట్ జోరు నేపథ్యంలో మార్కెట్ విలువల సవరణకు సర్కారు మొగ్గుచూపింది. ఇందులో భాగంగానే ఏడాదికి ఒక సారి సవరించడంతో పాటు అవసరమైన ప్రాంతాల్లో ఎప్పుడైనా మార్చేందుకు వీలుగా ఉత్తర్వులు జారీ చేసింది.
రిజిస్ట్రేషన్ల శాఖ కసరత్తు పూర్తి