‘తెలంగాణ నిర్ధారణ కేంద్రాల (టి-డయాగ్నొస్టిక్స్)’ పథకాన్ని అన్ని జిల్లాలకూ విస్తరించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఇప్పటికే 20 జిల్లాల్లో నిర్ధారణ పరీక్షల కేంద్రాలను నెలకొల్పగా.. మరో 13 చోట్ల నెలకొల్పేందుకు తాజాగా ఆదేశాలిచ్చింది. ఇవికాకుండా రాష్ట్రవ్యాప్తంగా మరో 8 వైరాలజీ ప్రయోగశాలలను కూడా ఏర్పాటు చేయాలని ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది (set up 13 more diagnostic centers and 8 virology laboratories in the state). వీటికి సంబంధించి రూ.96.39 కోట్లు విడుదల చేసింది. ఈ కేంద్రాల్లో 56 రకాల పరీక్షలు ఉచితంగా చేస్తారు. మొదట నాలుగేళ్ల కిందట హైదరాబాద్‌లోని ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ప్రివెంటివ్ మెడిసిన్ (ఐపీఎం) ఆవరణలో ‘తెలంగాణ డయాగ్నొస్టిక్ కేంద్రాన్ని’ ప్రభుత్వం ప్రారంభించింది. ఇందులో పూర్తిస్థాయిలో వాటంతటవే పరీక్షలు నిర్వహించి, ఫలితాలను వెల్లడించే రూ.3 కోట్ల విలువైన అత్యాధునిక పరికరాలు (ఫుల్లీ ఆటోమేటెడ్ మిషన్స్) మూడు ఉన్నాయి.
హైదరాబాద్ నగర పరిధిలోని పట్టణ ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు (Urban health centers), సామాజిక ఆరోగ్య కేంద్రాలు (Community Health Centers), ప్రాంతీయ, జిల్లా ఆసుపత్రులన్నీ దీని పరిధిలోకి వస్తాయి. రోజూ బస్తీ దవాఖానాలు, పట్టణ ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో సేకరించిన నమూనాలను ఈ ప్రయోగశాలకు చేరుస్తారు. రోగుల నుంచి నమూనాలు సేకరించినప్పుడే వారి ఈ-మెయిల్ ఐడీ, మొబైల్ నంబర్ తీసుకుంటారు. ఈ పరికరమే ఆన్‌లైన్‌లో.. రోగికి, సంబంధిత ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి, బస్తీ దవాఖానాకు రోగ నిర్ధారణ ఫలితాలను పంపిస్తుంది. ఈ విధానం విజయవంతమవడంతో.. మూడు నెలల క్రితం మరో 19 జిల్లాల్లోనూ ఇలాంటి కేంద్రాలను స్థాపించి ప్రాథమిక, సామాజిక ఆరోగ్య కేంద్రాలను వాటికి అనుసంధానం చేశారు. దీంతో సులువుగా రోగులు పరీక్షల ఫలితాలను పొందగలుగుతున్నారు. జిల్లాకొకటి చొప్పున ఏర్పాటు చేయాలనే లక్ష్యంతో ప్రభుత్వం మరో 13 కేంద్రాలను తాజాగా మంజూరుచేసింది. ఆరు నెలల్లో వీటి నిర్మాణం పూర్తిచేయాలని ఆదేశించింది. వీటి కోసం రూ.73.29 కోట్లను విడుదల చేసింది.
జిల్లాకొక ఆధునిక ప్రయోగశాల