telangana government: ఇప్పటివరకు కేవలం విద్యాశాఖ కింద ఉన్న వర్సిటీల్లో నియామకాలను మాత్రమే కామన్ బోర్డు లేదా టీఎస్‌పీఎస్‌సీ ద్వారా భర్తీ చేయాలని ప్రభుత్వం భావించింది. ఆ మేరకు రాష్ట్ర ఉన్నత విద్యామండలి కూడా నివేదికలు తయారు చేయడం, గణాంకాలు సమర్పించడం చేస్తూ వచ్చింది. గత నెలలో వర్సిటీల్లో పోస్టుల భర్తీ విధానం ఎలా ఉండాలో నివేదిక ఇవ్వాలని సీఎం కేసీఆర్ రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్‌కుమార్‌కు అప్పగించారు.
ఇటీవల జరిగిన మంత్రివర్గ సమావేశంలో అన్ని వర్సిటీల్లో నియామకాలకు విద్యాశాఖ ఆధ్వర్యంలో బోర్డును ఏర్పాటు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. విద్యాశాఖ పరిధిలోని ఓయూ, కేయూ, తెలంగాణ, శాతవాహన, పాలమూరు, మహాత్మాగాంధీ (నల్గొండ), జేఎన్‌టీయూహెచ్, తెలుగు, జేఎన్‌ఏఎఫ్‌ఏయూ, బాసర ఆర్‌జీయూకేటీ, అంబేడ్కర్ సార్వత్రిక విశ్వవిద్యాలయాలున్నాయి.
ఈ 11 విశ్వవిద్యాలయాల్లో 2020 బోధన, 2774 బోధనేతర సిబ్బంది ...మొత్తం 4,794 ఖాళీలుండగా అందులో దాదాపు 3,500 పోస్టులను భర్తీ చేస్తామని సీఎం ప్రకటించారు. వాటితో పాటు జయశంకర్ వ్యవసాయ వర్సిటీ, పీవీ నర్సింహారావు వెటర్నరీ, కొండా లక్ష్మణ్ ఉద్యాన, కాళోజీ వైద్య విశ్వవిద్యాలయంలోని బోధన, బోధనేతర ఖాళీలను కూడా ఈ బోర్డు ద్వారానే భర్తీ చేయనున్నారు.