తెలంగాణ

telangana

ETV Bharat / state

ధాన్యం కొనుగోళ్లకు సర్కారు సన్నద్ధం.. ఎప్పటినుంచంటే? - paddy procurement latest news

వానాకాలం ధాన్యం కొనుగోళ్లకు పౌరసరఫరాల శాఖ రంగం సిద్ధం చేస్తోంది. దీపావళికి ముందుగానే ఈనెల 22 నుంచి కొనుగోలు కేంద్రాలను ప్రారంభించేందుకు అధికారులు సన్నాహాలు చేస్తున్నారు.

Telangana government has decided to purchase grain from 22nd of this month
ధాన్యం కొనుగోళ్లకు సర్కారు సన్నద్ధం.. ఎప్పటినుంచంటే?

By

Published : Oct 16, 2022, 7:04 AM IST

ప్రస్తుత వానాకాలం ధాన్యం కొనుగోళ్లకు పౌరసరఫరాల శాఖ రంగం సిద్ధం చేస్తోంది. దీపావళి పండగకు ముందుగానే ఈ నెల 22 నుంచి కేంద్రాలను ప్రారంభించేందుకు అధికారులు సన్నాహాలు చేస్తున్నారు. పౌరసరఫరాల శాఖ మంత్రి గంగుల కమలాకర్‌ ఆధ్వర్యంలో ఇటీవల జరిగిన ధాన్యం కొనుగోళ్ల వ్యూహ సమావేశంలో ఈ మేరకు నిర్ణయం తీసుకున్నారు. రాష్ట్రంలో 1.50 కోట్ల టన్నుల ధాన్యం దిగుబడి వస్తుందన్నది అంచనా. సుమారు కోటి టన్నుల వరకు ప్రభుత్వ కొనుగోలు కేంద్రాలకు వస్తాయని అధికారులు చెబుతున్నారు. దశల వారీగా 6,800 కేంద్రాలను ఏర్పాటు చేయనుంది. ఉమ్మడి నిజామాబాద్‌, నల్గొండ జిల్లాల్లోనే పంట ముందుగా రానున్న దృష్ట్యా తొలుత అక్కడ కేంద్రాలు ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. బోధన్‌, జగిత్యాల, భువనగిరి ప్రాంతాల్లో ఇప్పటికే వరి కోతలు పూర్తయి విక్రయానికి వస్తున్నాయి. వ్యాపారులు కొంటున్నారు. ఆయా ప్రాంతాల్లో వచ్చేవి సన్న రకం. ప్రస్తుతానికి రికార్డు ధర పలుకుతోంది. ఈ సీజనుకు ధాన్యం కనీస మద్దతు ధరను సాధారణ రకానికి క్వింటాకు రూ.2,040గా, ‘ఎ’ గ్రేడుకు రూ.2,060గా కేంద్రం నిర్ణయించింది.

వారంలోగా రవాణా కాంట్రాక్టులు ఖరారుగడిచిన వానాకాలంలో సుమారు 71 లక్షల టన్నుల ధాన్యాన్ని రాష్ట్ర ప్రభుత్వం కొనుగోలు చేసింది. ఈ దఫా 90 లక్షల నుంచి కోటి టన్నుల వరకు కొనేందుకు సమాయత్తం అవుతున్నట్లు ఉన్నతాధికారి ఒకరు శనివారం ‘ఈనాడు’కు చెప్పారు. మిల్లులకు ధాన్యం తరలించేందుకు వీలుగా జిల్లాల వారీగా రవాణా కాంట్రాక్టులను వచ్చే వారంలోగా ఖరారు చేసేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. అలాగే 30 కోట్ల గోనె సంచులు అవసరమని అంచనా వేశారు. ప్రస్తుతానికి 15 కోట్లు అందుబాటులో ఉన్నాయి.

వర్షాలతోనే చిక్కులుకొనుగోలు కేంద్రాల్లో చాలినన్ని టార్పాలిన్లు అందుబాటులో ఉంచని పక్షంలో ఈ దఫా కూడా రైతులు భారీగా నష్టపోయే ప్రమాదం ఉంది. ప్రస్తుత సీజనులో తరచుగా భారీ వర్షాలు కురుస్తాయని వాతవరణ శాఖ అంచనా వేస్తోంది. కిందటేడాది కేంద్రాలకు తీసుకువచ్చిన ధాన్యం తడవటమే కాకుండా వర్షాలకు కొట్టుకుపోయిన సందర్భాలూ ఉన్నాయి. అధికారులు టార్పాలిన్ల సంఖ్యను పెంచడంతోపాటు కొనుగోలు కోసం రైతులు ఎదురుచూసే పరిస్థితి లేకుండా చర్యలు చేపట్టాల్సి ఉంది.

ఇవీ చూడండి:

ABOUT THE AUTHOR

...view details