mid day meals scheme: రాష్ట్రంలో కొత్త విద్యా సంవత్సరంలో పీఎం పోషణ్ పథకం (మధ్యాహ్న భోజనం) కింద ప్రభుత్వ పాఠశాలల్లోని విద్యార్థులకు రాగి జావ, మొలకలు-బెల్లం అందజేయాలన్న రాష్ట్ర ప్రభుత్వ ప్రతిపాదనకు మరోసారి కేంద్ర విద్యాశాఖ ఆమోదం లభించింది. పిల్లల్లో పోషకాహార లోపం నివారణకు మధ్యాహ్న భోజనానికి అదనంగా 2019-20లో రాగి జావ, 2021-22లో రాగిజావ, పల్లీ పట్టి ఇస్తామని రాష్ట్ర ప్రభుత్వం ప్రతిపాదించగా...కేంద్రం ఆమోదించింది. అయినా అమలుచేయకుండా రాష్ట్ర విద్యాశాఖ నిర్లక్ష్యంగా వ్యవహరించింది. ఎందుకు అమలు చేయలేదని కేంద్ర విద్యాశాఖ కూడా ప్రశ్నించడం లేదు. ఈ నేపథ్యంలో ఈసారైనా పిల్లల నోటికి రాగి జావ, మొలకలు-బెల్లం అందేనా అన్న సందేహం వ్యక్తమవుతోంది.
* ఈసారి రాష్ట్రంలోని 16,828 ప్రాథమిక పాఠశాలల్లో 59 రోజులపాటు మొత్తం 7.75 లక్షల మంది పిల్లలకు రాగి జావ, 7,277 ప్రాథమికోన్నత, జడ్పీ పాఠశాలల్లోని 6,7 తరగతుల్లోని 4.48 లక్షల మంది పిల్లలకు 61 రోజులపాటు మొలకలు-బెల్లం అందించాలని రాష్ట్ర ప్రభుత్వం ప్రతిపాదించింది. అందుకు రూ.13.70 కోట్లు ఖర్చవుతుందని అంచనా వేసింది. దానికి కేంద్ర విద్యాశాఖ ఆధ్వర్యంలోని ప్రాజెక్టు ఆమోదిత మండలి (పీఏబీ) ఆమోదం తెలిపింది. పీఏబీ తీర్మానాల నివేదిక తాజాగా విద్యాశాఖకు అందింది. ఖర్చులో తమ వాటాగా రూ.8.22 కోట్లు ఇచ్చేందుకు కేంద్రం అంగీకరించింది.
* రాష్ట్రంలో 1-8 తరగతుల విద్యార్థులతోపాటు బాలవాటిక (శిశు విద్య), బాల కార్మిక పాఠశాలల్లోని పిల్లలు 15.87 లక్షల మందికి మధ్యాహ్న భోజనం అందించేందుకు రూ.286.26 కోట్లకు కేంద్రం ఆమోదం తెలిపింది. అందులో కేంద్రం 60 శాతం నిధులు ఇస్తుంది. పనిదినాలు, విద్యార్థుల సంఖ్య పెరిగితే ఆ మేరకు నిధులు ఇస్తామని పేర్కొంది. హరితహారం కింద అన్ని పాఠశాలల్లో కిచెన్ గార్డెన్లు ఏర్పాటు చేస్తామని, మండల, జిల్లా, రాష్ట్ర స్థాయిల్లో వంటల పోటీలు జరుపుతామని రాష్ట్ర ప్రభుత్వం కేంద్రానికి తెలిపింది.
కేంద్రం అసంతృప్తి