రాష్ట్రంలో (Telangana) నలభైకి పైగా నగరాలు, ప్రధాన పట్టణాలను ఆధునిక సాంకేతికతతో ఆకర్షణీయం(స్మార్ట్)గా (Smart Telangana) తీర్చిదిద్దాలని, ప్రజలకు డిజిటల్ సేవలు అందించాలని రాష్ట్ర ప్రభుత్వం(Telangana state government) నిర్ణయించింది. ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ (ktr) ఆదేశాల మేరకు దీనిని రూపొందించింది. అంతర్జాల, ఐటీ ఆధారిత(ఐవోటీ) సేవలు, బ్లాక్‌చైన్, రోబోటిక్స్, క్లౌడ్ కంప్యూటింగ్, మెషిన్ లెర్నింగ్, కృత్రిమమేధ తదితర వినూత్న సాంకేతికత పరిజ్ఞానంతో ప్రజలకు రక్షితనీరు, విద్యుత్, విద్య, వైద్య, గృహనిర్మాణ, పార్కింగు, వ్యర్థాల శుద్ధి తదితర సేవలందించేందుకు వీలుగా ఆయా నగరాల్లో కొత్త ప్రాజెక్టును త్వరలో ప్రారంభించనుంది. నవీన పరిజ్ఞానంతో నగరాల్లో జీవన ప్రమాణాలను మెరుగుపరచి, సేవల ద్వారా నగరాలు, పట్టణాల ర్యాంకులను పెంచి, తద్వారా పెట్టుబడుల సమీకరణ, ఉద్యోగాల కల్పన, నైపుణ్యాభివృద్ధి చర్యలు చేపడతారు. ఈ ప్రాజెక్టును ఐటీ, పరిశ్రమలు, పురపాలక శాఖతో కలిసి ప్రత్యేక విభాగం పర్యవేక్షిస్తుంది.
పౌరసేవలు
ఎంపిక చేసే నగరాలు, పట్టణాల్లో ఎలక్ట్రానిక్ పాలన, పౌరసేవలను పూర్తిగా డిజిటలీకరిస్తారు. మీసేవా కేంద్రాలను పెంచుతారు. ఆధునిక సాంకేతిక విస్తరణకు మౌలిక వసతులను కల్పిస్తారు. టీఫైబర్ అందుబాటులోకి వచ్చాక సేవలను విస్తరిస్తారు. విపత్తులు, వ్యాధుల తీవ్రత తదితరాలను పసిగట్టి విపత్తుల నివారణ, పురపాలక, వైద్యఆరోగ్య, పోలీసు తదితర శాఖల పరంగా అప్రమత్తత చర్యలు చేపడతారు.
పర్యాటకులకు ఉపయోగపడేలా
ఐటీ ఆధారిత సాంకేతికతతో నగరాలు, ముఖ్యపట్టణాల్లో విద్యుద్దీపాలు, వాటి నియంత్రణ ద్వారా అయ్యే విద్యుత్ ఆదాతో మెరుగైన సేవలందుతాయి. ట్రాఫిక్ సిగ్నళ్లను అనుసంధానిస్తారు. రద్దీపై సత్వర సమాచారం, టికెట్ల జారీ, బస్సులకు జీపీఎస్ పరిజ్ఞానం కల్పిస్తారు. వాయు, శబ్దకాలుష్యాలపై కన్నేసి..నివారణ చర్యలు చేపడతారు. రాష్ట్రానికి వచ్చే దేశవిదేశీ పర్యాటకులకు సందర్శనీయ స్థలాల సమాచారం అందజేస్తారు.