కోటి మంది పేద మహిళలకు ఉచిత పంపిణీ కోసం చేపట్టిన బతుకమ్మ చీరుల ఉత్పత్తి... రూ.318 కోట్లతో ఈ ఏడాది జనవరి నుంచే సిరిసిల్లలో ప్రారంభమైంది. గతంలో మార్చి నుంచి ఉత్పత్తి ప్రారంభించి, బతుకమ్మ పండుగ నాటికి చీరలను పంచేవారు. ఈసారి ముందుగా పంపిణీ చేయాలనే ఉద్దేశంతో రెండు నెలల ముందు నుంచే ఉత్పత్తి చేపట్టారు. మొదట్లో అయిదు వేల మరమగ్గాలతో పనులు ప్రారంభమయ్యాయి. మార్చి నాటికి అవి ఆరు వేలకు చేరాయి. పూర్తిస్థాయిలో ఎనిమిది వేల మగ్గాలతో పనులు ప్రారంభం కావాల్సి ఉండగా... లాక్‌డౌన్ కారణంగా మార్చి 22 నుంచి ఉత్పత్తి నిలిచిపోయింది.
అన్ని అందుబాటులో ఉన్నాయి...
లాక్‌డౌన్ నిబంధనలు సడలించిన తర్వాత మళ్లీ ఈ నెల ఏడో తేదీ నుంచి ఉత్పత్తి పునఃప్రారంభమైంది. క్రమేపీ పుంజుకుంటోంది. ప్రస్తుతం ఆరువేల మగ్గాలు నడుస్తున్నాయి. రోజూ 30 వేల చీరలు తయారవుతున్నాయి. ఎనిమిది వేల మంది కార్మికులు పనిచేస్తున్నారు. జూన్ 15 నాటికి మగ్గాలను పెంచి ప్రతి రోజూ లక్ష చొప్పున చీరలను తయారు చేయించాలనే లక్ష్యాన్ని ప్రభుత్వం నిర్దేశించింది. చీరలకు అవసరమైన నూలు నిల్వలు అందుబాటులో ఉన్నాయి. కార్మికులంతా సిరిసిల్లతో పాటు చుట్టుపక్కల జిల్లాలకు చెందిన వారే. ఉత్పత్తి ప్రారంభమయ్యాక వారంతా విధుల్లో చేరుతున్నారు.