ప్రతి భూ సమస్యా పరిష్కరించాల్సిందే: ప్రభుత్వం - Telangana Government Guidelines
అపరిష్కృతంగా ఉన్న భూ సమస్యలను తీర్చే బాధ్యతను ప్రభుత్వం కలెక్టర్లకు అప్పగించింది. ఈ మేరకు శుక్రవారం పలు కీలక మార్గదర్శకాలు జారీ చేసింది. ప్రతి సమస్య పరిష్కారానికి నిర్దిష్ట గడువును విధించింది.
ప్రతి భూ సమస్యా పరిష్కరించాల్సిందే: ప్రభుత్వం
By
Published : Jan 16, 2021, 6:54 AM IST
భూ యజమానులు లేదా బాధితులు చేసుకున్న దరఖాస్తులను పరిశీలించాక కలెక్టర్ తదుపరి ప్రక్రియకు అనుమతులు జారీ చేస్తారని మార్గదర్శకాలలో ప్రభుత్వం తెలిపింది. సమస్య పరిష్కారమవుతుందా లేదా తిరస్కారమా అనేది దరఖాస్తుదారు సెల్‌ఫోన్‌కు ఎస్‌ఎంఎస్ రూపంలో పంపనున్నారు. పెండింగ్ మ్యుటేషన్లు, ఈ కేవైసీ, ఎల్‌టీఆర్ కేసులు, ఆధార్ పెండింగ్ కేసులు, పట్టా పాసుపుస్తకాల్లో నమోదు కాని విస్తీర్ణాలు, సర్వే నంబర్లు, సాదాబైనామా తదితర పది రకాల భూ సమస్యలకు పరిష్కారం చూపేందుకు ప్రభుత్వం మార్గదర్శకాలు విడుదల చేసింది.
విచారణ అనంతరమే పరిష్కారం
రెవెన్యూ కోర్టుల్లోని కేసుల పరిష్కారాన్ని కలెక్టర్ల నేతృత్వంలోని ట్రైబ్యునళ్లకు ప్రభుత్వం మళ్లించిన విషయం తెలిసిందే. ఇదే బాటలో క్షేత్రస్థాయిలో అపరిష్కృతంగా ఉన్న పార్ట్-బి, సాదాబైనామా తదితర సమస్యలను కొలిక్కి తెచ్చేందుకు కలెక్టర్లకే అధికారాలు కల్పించింది. ఎక్కడా కాగితాల రాతకోతలు, ప్రత్యక్ష లావాదేవీలు లేకుండా పూర్తిగా ఎలక్ట్రానిక్ రూపంలో (ఆన్‌లైన్) దరఖాస్తు, పరిష్కారం, పాసుపుస్తకం జారీ ప్రక్రియను ప్రభుత్వం అందుబాటులోకి తెచ్చింది. అవసరమైన పక్షంలో విచారణ నిర్వహించి నిర్ణయం తీసుకునే అధికారాలను కలెక్టర్లకు కల్పించింది. ఆ తరువాతే తహసీల్దార్లు డిజిటల్ సంతకం చేసి పాసుపుస్తకం జారీ చేసేలా నిర్దేశించింది.
నిషేధిత జాబితాలోకి ప్రభుత్వ జాగాలు
ప్రభుత్వ స్థలాలకు సంబంధించిన పూర్తి వివరాలను నెల వ్యవధిలో నిషేధిత భూముల జాబితాలో చేర్చాలని ప్రభుత్వం స్పష్టమైన ఆదేశాలు జారీచేసింది. రాష్ట్రంలో వివిధ అవసరాలకు సేకరించిన భూములను రెవెన్యూ దస్త్రాల్లో యాజమాన్య హక్కుల విషయంలో మార్పులు కూడా చేయాల్సి ఉందని, కలెక్టర్లు మిషన్ మోడ్‌లో ఇటువంటి భూములను గుర్తించాలని ఆదేశించింది.