Forest officer wife became Tahsildar : స్మగ్లర్ల దాడిలో ప్రాణాలు కోల్పోయిన అటవీ శాఖ రేంజ్ అధికారి శ్రీనివాసరావు కుటుంబానికి తెలంగాణ ప్రభుత్వం అండగా నిలిచింది. ఆయన సేవలను ప్రశంసిస్తూ శ్రీనివాసరావు కుటుంబానికి పెద్ద దిక్కుగా నిలిచింది. ఇంటి స్థలం, ఆర్థిక సహాయంతో పాటు డిప్యూటీ తహసీల్దార్‌గా శ్రీనివాసరావు భార్య భాగ్యలక్ష్మికి ప్రభుత్వ ఉద్యోగం ఇచ్చారు. రంగారెడ్డి జిల్లా మహేశ్వరం మండలంలోని తుమ్మలూరులో జరిగిన హరితోత్సవ సభలో నియామక పత్రాన్ని ముఖ్యమంత్రి కేసీఆర్ స్వయంగా అందజేశారు. అటవీ శాఖ అధికారుల భద్రత కోసం ఆయుధ సంపత్తిని పెంచడంతో పాటు ప్రత్యేక పోలీస్ స్టేషన్లు ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు.
అటవీ అధికారుల కుటుంబానికి ప్రభుత్వం చేయూత నివ్వడంతో పాటు అటవీ శాఖ రేంజ్ ఆఫీసర్స్ చరిత్రలోనే నిబంధనలను సడలించి ఉద్యోగం ఇవ్వడం ఎంతో ఆనందంగా ఉందని ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్స్ అసోసియేషన్ సభ్యులు ఆనందం వ్యక్తం చేశారు. కేసీఆర్ తమ కుటుంబానికి తండ్రిగా నిలబడి ఆదుకున్నారని, కుటుంబం తరపున ధన్యవాదాలు చెబుతున్నట్లు భాగ్యలక్ష్మి తెలిపారు.
"రాష్ట్ర ప్రభుత్వం మా కుటుంబాన్ని ఆదుకున్నందుకు ధన్యవాదములు. మాకు ఇంటి స్థలం ఇచ్చారు. దీంతో పాటు ప్రభుత్వం రూ.50,00,000 ఆర్థిక సాయం చేసింది."- భాగ్యలక్ష్మి, అటవీ శాఖ రేంజ్ అధికారి శ్రీనివాసరావు భార్య