No Confidence Motions in Telangana municipalities : రాష్ట్రంలో పలు పట్టణాల్లో అవిశ్వాస నోటీసుల ప్రక్రియ కొనసాగుతూనే ఉంది. కార్పొరేషన్ మేయర్లు, మున్సిపల్ ఛైర్‌పర్సన్లపై అవిశ్వాసం ప్రకటిస్తూ.. పలుచోట్ల కార్పొరేటర్లు, కౌన్సిలర్లు నోటీసులు ఇస్తున్నారు. రాష్ట్రవ్యాప్తంగా ఇప్పటి వరకు 18కి పైగా పట్టణాల్లో నోటీసులు ఇచ్చారు. సాధారణంగా అవిశ్వాస నోటీసు వస్తే నిబంధనల మేరకు పరిశీలించి.. నిర్దేశిత గడువులోగా పాలక మండలి ప్రత్యేక సమావేశం ఏర్పాటు చేసి ఓటింగ్ చేపట్టాల్సి ఉంటుంది. అయితే రాష్ట్రంలో ప్రస్తుతం ప్రత్యేక పరిస్థితులు నెలకొన్నాయి. అవిశ్వాస తీర్మానం గడువును 3 నుంచి 4ఏళ్లకు పొడిగిస్తూ రాష్ట్ర ప్రభుత్వం తీసుకొచ్చిన చట్ట సవరణ బిల్లు గవర్నర్ వద్ద పెండింగ్‌లో ఉంది. 5 నెలలుగా దానిపై ఎలాంటి నిర్ణయం తీసుకోకపోవడంతో ఉభయ సభలు ఆమోదించినప్పటికీ చట్ట రూపం దాల్చలేదు.
No Confidence Motions in TS Municipalities : ప్రస్తుతం ఉన్న చట్టం ప్రకారం మూడేళ్ల గడువును పరిగణలోకి తీసుకోవాలనుకున్నా.. అందుకు సంబంధించి ప్రభుత్వం నుంచి ఇప్పటి వరకు ఎలాంటి నిబంధనలు లేవు. పాత పురపాలక చట్టం ప్రకారం కొత్త పాలక మండలి కొలువు తీరిన నాలుగేళ్ల తర్వాతే అవిశ్వాస నోటీసు ఇవ్వాల్సి ఉంటుంది. కొత్త చట్టం ప్రకారం గడువును మూడేళ్లకు కుదించారు. అయితే అందుకు అనుగుణంగా మార్గదర్శకాలు ఇవ్వలేదు. కొత్త పంచాయతీరాజ్ చట్టం ప్రకారం గ్రామీణ ప్రాంత స్థానిక సంస్థల్లో అవిశ్వాస గడువు నాలుగేళ్లుగా ఉంది. అదే తరహాలో పట్టణ ప్రాంత స్థానిక సంస్థలకూ గడువు నాలుగేళ్లు ఉండేలా రాష్ట్ర ప్రభుత్వం చట్ట సవరణ కోసం బిల్లు తీసుకొచ్చింది.
ఏం చేయమంటారు సార్..: మంత్రివర్గంతో పాటు శాసనసభ, మండలి ఆమోదం కూడా లభించింది. ఆ బిల్లుకు గవర్నర్ ఆమోదముద్ర లభించకపోవడంతో చట్ట సవరణ ప్రక్రియ పూర్తి కాలేదు. ఈ తరుణంలో ఏం చేయాలో తమకు స్పష్టత ఇవ్వాలని ఆయా జిల్లాల కలెక్టర్లు పురపాలక శాఖ ఉన్నతాధికారులను కోరారు. ఇందుకు సంబంధించి ఎలా వ్యవహరించాలో వారికి కూడా స్పష్టత లేదు. దీంతో పురపాలక శాఖ అధికారులు ఈ విషయాన్ని రాష్ట్ర ప్రభుత్వానికి నివేదించారు.