రాయలసీమ ఎత్తిపోతల పథకం (Rayalaseema Lift Irrigation)లో ఉల్లంఘనలను స్వయంగా జాతీయ హరిత ట్రైబ్యునల్ (National Green Tribunal) బృందం తనిఖీ చేయాలని తెలంగాణ ప్రభుత్వం కోరింది. ఈ మేరకు ఎన్జీటీ చెన్నై ధర్మాసనంలో రాయలసీమ ఎత్తిపోతలపై రాష్ట్ర ప్రభుత్వం ధిక్కరణ పిటిషన్‌ను దాఖలు చేసింది.
2020 అక్టోబర్ 29న పర్యావరణ అనుమతులు లేకుండా ప్రాజెక్టు పనులు చేపట్టవద్దని ట్రైబ్యునల్ ఆదేశాలకు విరుద్ధంగా నిర్మాణం చేపడుతున్నారని తెలంగాణ ప్రభుత్వం పిటిషన్‌లో పేర్కొంది. కేంద్ర పర్యావరణ శాఖ, జలశక్తి శాఖ, కృష్ణా నది యాజమాన్య బోర్డుల నుంచి సరైన అనుమతులు లేకుండా కడుతున్న ప్రాజెక్టు పూర్తిగా నిలుపుదల చేసేలా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వాన్ని ఆదేశించాలని కోరింది.
వేగంగా పనులు...
1,500 మంది కూలీలు, భారీ యంత్రాలు, వాహనాలతో పనులు వేగంగా జరుగుతున్నాయని తెలంగాణ ప్రభుత్వం పిటిషన్‌లో పేర్కొంది. ఇదివరకే దాఖలైన మరో పిటిషన్‌లో కేంద్ర అటవీ, పర్యావరణ శాఖ ప్రాంతీయ అధికారులు, కృష్ణానది యాజమాన్య బోర్డు అధికారులు ఎత్తిపోతలను సందర్శించి పనులు జరుగుతున్నాయో లేదా నివేదిక ఇవ్వాలని ఎన్జీటీ ఆదేశించింది.
నివేదిక ఇచ్చేందుకు అధికారులు ఎత్తిపోతలను సందర్శించకుండా ఏపీ ప్రభుత్వం అడ్డుకుంటుందని.. అందువల్ల స్వయంగా ట్రైబ్యునల్ బృందం ప్రాజెక్టును తనిఖీ చేయాలని రాష్ట్ర ప్రభుత్వం విజ్ఞప్తి చేసింది. ఇదే అంశంపై ఇప్పటికే తెలంగాణ వాసి గవినోళ్ల శ్రీనివాస్ వేసిన ధిక్కరణ పిటిషన్ కూడా ఎన్జీటీలో పెండింగ్లో ఉంది.
ఎన్డీటీ ఆగ్రహం...
తమ ఆదేశాలకు విరుద్ధంగా రాయలసీమ ఎత్తిపోతల పథకం పనులు చేపడితే తీవ్ర చర్యలు తీసుకోవాల్సి ఉంటుందని జాతీయ హరిత ట్రైబ్యునల్(National Green Tribunal) ఏపీ ప్రభుత్వంపై ఇదివరకే ఆగ్రహం వ్యక్తం చేసింది. పనులు జరుగుతున్నట్లు తేలితే రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిని జైలుకు పంపాల్సి ఉంటుందని హెచ్చరించింది.
పర్యావరణ అనుమతులు లేకుండా రాయలసీమ ఎత్తిపోతల పనులు జరపొద్దని ఇచ్చిన ఆదేశాలను ఉల్లంఘించి పనులు చేపడుతున్నారని తెలంగాణ వాసి గవినోళ్ల శ్రీనివాస్ ఎన్జీటీని ఆశ్రయించిన సంగతి తెలిసిందే. ఏపీ సీఎస్ సహా బాధ్యులైన అధికారులపై చర్యలు తీసుకోవాలని ధిక్కరణ పిటిషన్‌లో శ్రీనివాస్ కోరారు. దీనిపై విచారణ జరిపిన జస్టిస్ రామకృష్ణన్ నేతృత్వంలోని ఎన్జీటీ చెన్నై ధర్మాసనం కీలక వ్యాఖ్యలు చేసింది.