హైదరాబాద్ ప్రజలు వరదలతో తీవ్ర ఇబ్బందులు పడ్డారని పీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి అన్నారు. వారిని ఆదుకోవడంలో తెరాస ప్రభుత్వం వైఫల్యం చెందిందని ఆరోపించారు. రెండు లక్షల కోట్లు బడ్జెట్ ఉన్న రాష్ట్రంలో హైదరాబాద్ నగరానికి అయిదువేల కోట్లు ఇవ్వలేరా అని ప్రశ్నించారు. భాగ్యనగర అభివృద్ధికి 67 వేల కోట్లు ఖర్చు చేసినట్లు మంత్రి కేటీఆర్ చెబుతున్నారని.. ఆ మొత్తం దేనికి ఖర్చు చేశారో.. ఆ దేవుడికి తెలియాలన్నారు. ముఖ్యమంత్రి నివాసానికి కిలోమీటర్ దూరంలో ఉన్న ఎంఎస్‌మక్తా ప్రజలు వర్షాలకు అన్ని కోల్పోయి తీవ్ర ఇబ్బందులు పడుతుంటే కేసీఆర్ పట్టించుకోవడం లేదన్నారు.
వరద బాధిత కుటుంబాలకు పరిహారం ఇచ్చేందుకు రూ.550 కోట్లు మంజూరు చేసిన ప్రభుత్వం.. ఈ నెల రెండో తేదీ నాటికి రూ.387 కోట్లు పంపిణీ చేసినట్లు వెల్లడించినా.. ఎవరెవరికి ఎంత ఇచ్చారో.. ఎందుకు బహిర్గతం చేయలేదని నిలదీశారు. కరోనా సమయంలో ఇచ్చిన రూ.1,500 మొత్తాన్ని నేరుగా బ్యాంకు ఖాతాల్లో వేసిన రాష్ట్ర ప్రభుత్వం ఇప్పుడు వరదబాధిత కుటుంబాలకు నగదు ఏలా ఇస్తారని ప్రశ్నించారు. చెక్కుల రూపంలో ఎందుకు ఇవ్వలేదని ప్రశ్నించారు.