తెలంగాణ

telangana

ETV Bharat / state

29 వరకు లాక్‌డౌన్‌.. చిల్లర రాజకీయాలొద్దు: కేసీఆర్

మే 29 లాక్​డౌన్​ పొడిస్తున్నట్లు సీఎం కేసీఆర్​ ప్రకటించారు. మద్యం దుకాణాలకు గ్రీన్​సిగ్నల్ ఇచ్చేశారు. త్వరలోనే పదో తరగతి పరీక్షలు నిర్వహించటంతోపాటు ఇంటర్​ జవాబు పత్రాల మూల్యాంకన చేపడతామని తెలిపారు. మంత్రిమండలిలో తీసుకున్న కీలక నిర్ణయాలేంటంటే...

telangana government extend lockdown till may 29th
29 వరకు లాక్​డౌన్​ పొడిగింపు.. నేటి నుంచి మద్యం అమ్మకాలు

By

Published : May 6, 2020, 6:51 AM IST

Updated : May 6, 2020, 10:21 AM IST

రాష్ట్రంలో కరోనాను పూర్తిస్థాయిలో నియంత్రించడానికి వీలుగా ఈ నెల 29 వరకు లాక్‌డౌన్‌ను పొడిగిస్తున్నట్లు ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు ప్రకటించారు. రాత్రి ఏడుగంటల నుంచి ఉదయం వరకు రాష్ట్రమంతటా కర్ప్యూ కూడా అమలులో ఉంటుందని తెలిపారు. ఆరెంజ్‌, గ్రీన్‌జోన్ల పరిధిలో ఉన్న 27 జిల్లాల్లో అన్ని దుకాణాలు తెరుచుకోవడానికి అనుమతి ఇస్తున్నట్లు ప్రకటించారు.మంగళవారం మంత్రివర్గ సమావేశం అనంతరం ముఖ్యమంత్రి కేసీఆర్‌ పలు కీలక నిర్ణయాలను వెల్లడించారు. రాష్ట్రంలో కరోనా నియంత్రణకు ఇప్పటివరకు తీసుకొన్న చర్యలు మంచి ఫలితాలు ఇచ్చాయన్నారు.. స్టాంపులు, రిజిస్ట్రేషన్లు, రవాణా శాఖ కార్యాలయాలు పూర్తి స్థాయిలో రాష్ట్రమంతటా పని చేస్తాయని తెలిపారు. గృహనిర్మాణ పనులు చేసుకోవచ్చన్నారు. ఇందుకు అవసరమైన దుకాణాలు కూడా అందుబాటులో ఉంటాయని చెప్పారు.

రెడ్‌జోన్‌ జిల్లాల్లో కఠినంగా నిబంధనల అమలు

రెడ్‌జోన్‌ జిల్లాల్లో హైదరాబాద్‌, రంగారెడ్డి, మేడ్చల్‌-మల్కాజ్‌గిరి జిల్లాల్లో జనసాంద్రత ఎక్కువగా ఉందని.. మొత్తం కేసుల్లో 66 శాతం ఇక్కడే ఉన్నాయని ఆదోళన వ్యక్తం చేశారు. సామాజిక వ్యాప్తికి కూడా ఇక్కడే అవకాశం ఉన్నందున ఎలాంటి పరిస్థితిలోనూ రాజీపడబోమని స్పష్టం చేశారు. ఇక్కడ నిబంధనలు కఠినంగా అమలవుతాయన్నారు. ప్రజల ఉజ్వల భవిష్యత్తు కోసం హైదరాబాద్‌ను సురక్షితంగా కాపాడుకోవాలి చెప్పారు.

కేసులు తగ్గినా 70 రోజులు చూడాలని శాస్త్రవేత్తలు చెప్తున్నందున లాక్‌డౌన్‌ను పొడిగిస్తున్నామని చెప్పారు. హైదరాబాద్‌లో కరోనా కర్వ్‌ తగ్గుముఖం పడుతోందని... వైద్య ఆరోగ్యశాఖకు అవసరమైన పీపీఈ కిట్లు సహా అన్నీ పూర్తిస్థాయిలో అందుబాటులో ఉన్నాయని వెల్లడించారు. ఇతర రాష్ట్రాలకు కూడా సాయం చేసే స్థితిలో ఉన్నామన్నారు. 15న మళ్లీ సమీక్షించి... పరిస్థితిని బట్టి హైదరాబాద్‌లో కూడా కొన్ని దుకాణాలు తెరిచే విషయం పరిశీలిస్తామని పేర్కొన్నారు.

పొరుగు రాష్ట్రాల్లో అనుమతించినందుకే

రెడ్‌జోన్లు సహా అన్ని ప్రాంతాలలోనూ బుధవారం నుంచే మద్యం అమ్మకాలను అనుమతిస్తున్నామని సీఎం వెల్లడించారు. తెలంగాణలో గుడుంబాను పూర్తిస్థాయిలో అరికట్టామని.. ఒకప్పుడు ఇదొక సాంఘిక దురాచారంలా ఉండేదన్నారు. ఒకసారి వరంగల్‌ వెళ్తే అక్కడ అన్నీ గుడుంబా బట్టీలే కనిపించాయన్నారు. వాటిని చూసి చాలా బాధపడ్డామని తెలిపారు. దీన్ని నివారించేందుకు తక్కువ ధరతో మద్యం తేవాలని ఆలోచించామని చెప్పారు.

గుడుంబా తయారీదార్లను ఆ వృత్తి నుంచి మళ్ళించే ఉద్దేశంతో దాదాపు రూ.వెయ్యి కోట్లు ఖర్చుపెట్టి ప్రత్యామ్నాయ ఉపాధి కల్పించామనన్నారు. ఆబ్కారీ శాఖ సంచాలకులు అకున్‌ సబర్వాల్‌ ఈ విషయంలో గట్టి కృషి చేశారని చెప్పారు. తెలంగాణ నుంచి గుడుంబాను తరిమేశారు... కానీ, ఇప్పుడు మళ్ళీ ఆ కేసులు నమోదవుతున్నాయని తెలిపారు.

మనతో సరిహద్దు పంచుకుంటున్న అన్ని రాష్ట్రాల్లో మద్యం అమ్మకాలు మొదలయ్యాయి.. ఇటువంటి పరిస్థితుల్లో మన దుకాణాలు తెరవకపోతే అక్రమ రవాణా మొదలయ్యే అవకాశం ఉందన్నారు. వీటన్నింటి దృష్ట్యా నేటి నుంచే రెడ్‌ జోన్లు సహా అన్ని చోట్లా మద్యం దుకాణాలు తెరుస్తాం. కంటెయిన్‌మెంట్‌ ప్రాంతాల్లో మాత్రం మద్యం దుకాణాలు మూసే ఉంటాయి వెల్లడించారు. మద్యం దుకాణాల వద్ద కచ్చితంగా భౌతిక దూరం పాటించాలన్నారు.

ఎక్కడైనా దీన్ని ఉల్లంఘించినట్లు తెలిస్తే ఆ క్షణమే సదరు దుకాణం లైసెన్సు రద్దుచేస్తామని హెచ్చరించారు. మద్యం దుకాణాలు ఉదయం 10 నుంచి సాయంత్రం ఆరు గంటల వరకూ తెరచి ఉంచుతారని చెప్పారు. ప్రజలు క్రమశిక్షణతో, ఎడం పాటిస్తూ కొనుగోళ్లు చేయాలని కోరారు. అలానే మాస్కు ధరించకపోతే మద్యం అమ్మవద్దని స్పష్టం చేశారు. దుకాణాల వద్ద శానిటైజర్లు అందుబాటులో ఉంచాలన్నారు.

పేద న్యాయవాదులకు రూ 25 కోట్లు

యువ, పేద న్యాయవాదులకు రూ.25 కోట్లు మంజూరు చేశాం. రాష్ట్ర హైకోర్టు సీజీఐ ఆధ్వర్యంలో ఇవ్వనున్నామని కేసీఆర్​ తెలిపారు. డైనమిక్‌ స్టేట్‌ అయిన తెలంగాణ గొప్పగా పనులు జరిగే రాష్ట్రమన్నారు. లక్షల మంది ఎన్నో రంగాల్లో పనిచేస్తున్నారని... 7.50 లక్షల మంది వలస కార్మికులకు అన్ని వసతులు కల్పించామని తెలిపారు. వారికి కూడా నెలకు రూ.1500 ఇచ్చాం. వలస కార్మికులు ఇక్కడ ఉంటే ఉపాధి కల్పిస్తామన్నారు. వెళ్లాలనుకునేవారిని పంపిస్తామని చెప్పారు.

మొత్తం ధాన్యం కొనడం దేశ చరిత్రలోనే రికార్డు

దేశ చరిత్రలో మొత్తం ధాన్యాన్ని కొన్న రాష్ట్రమే లేదని.. రైతుల ఊళ్లకే వెళ్లి మద్దతు ధర ఇచ్చి ధాన్యం కొన్న సందర్భమే గతంలో లేదన్నారు. అనేక పార్టీలు పాలించే రాష్ట్రాలున్నాయని... ఏ రాష్ట్రమూ కొంటలేదని చెప్పారు. తెలంగాణ ఒక్కటే కొంటున్నదని... ఈరోజు బిహార్‌, ఛత్తీస్‌గఢ్‌ నుంచి తెలంగాణకు మక్కలు వస్తున్నాయని తెలిపారు. రైతులను కాపాడుకోవాలని వందశాతం కొంటున్నామని స్పష్టం చేశారు.

చిల్లర రాజకీయాలు చేస్తున్నారు

మన పక్కనే ఉన్న ఛత్తీస్‌గఢ్‌లో కాంగ్రెస్‌ ప్రభుత్వం ఉందని.. రాహుల్‌గాంధీ స్వయంగా ప్రకటించారు. రూ.2500 మద్దతు ధర ఇస్తామన్నారు. కానీ అక్కడ ఎకరానికి 15 క్వింటాళ్లను మాత్రమే కొంటున్నారని సీఎం తెలిపారు. అక్కడ రూ.2 లక్షల రుణం మాఫీ చేస్తామన్నారని ఏం చేయలేదని చెప్పారు. వీళ్లు ఇక్కడ మాట్లాడుతున్నారని.. చిల్లర రాజకీయాలు చేస్తున్నారుని.. బతుకమ్మ చీరలు తగులబెట్టారని విమర్శించారు.

ఇప్పుడు ధాన్యం తగులబెడుతున్నారని... కొందరు నాయకులు ధాన్యం డబ్బు ఆలస్యంపై మాట్లాడుతున్నారని... మిల్లుకు ధాన్యం పోయి బియ్యం వచ్చాక డబ్బు వేస్తారు చెప్పారు. మే నెల మొత్తం వేస్తారని నేను ముందే చెప్పానన్నారు. మెడ మీద తలకాయ ఉన్న వాళ్లు ఎందుకు తగలబెడతారు? కాంగ్రెస్‌ వాళ్లకు ఏ అంశం ఎత్తుకోవాలనే తెలివి కూడా లేదన్నారు. నిఖార్సయిన రైతు తాలు అమ్ముతాడా? తాలు అమ్మి డబ్బు ఇవ్వమని కోరతారా? ఆ ధాన్యం ఎటు పోతుంది?క్వింటా వడ్లు తీసుకుంటే 67 కిలోల బియ్యం రావాలన్నారు.

తాలు తీసుకుంటే ఎందుకు వస్తుంది. ఏ ముఖం పెట్టుకుని ఇక్కడ కాంగ్రెస్‌ నేతలు మాట్లాడుతున్నారని ప్రశ్నించారు. మీ కాలంలో ఎక్కడైనా కొన్నారా.. ప్రభుత్వ నిర్లక్ష్యం వల్ల పిడుగులు పడుతున్నాయని కొందరు మాట్లాడుతున్నారు. దేశంలో ఎక్కడైనా రైతుబీమా, రైతుబంధు, ఉచిత కరెంటు ఉన్నాయా? ఇవన్నీ ఉన్న రాష్ట్రంలో జోకర్లలా మాట్లాడితే బఫూన్లు అనకుండా ఇంకేం అంటామన్నారు. ఏ అంశం తీసుకోవాలనే తెలివి ప్రతిపక్ష నాయకులకు లేదన్నారు. వీళ్లు ఆల్‌పార్టీ అని సీఎస్‌ను కలిశారని... వారికి సంస్కారం ఉందా? నిర్మాణాత్మకమైన ఆరోపణలు చేస్తే మేం స్పందిస్తామన్నారు. తెలంగాణ లాంటి రాష్ట్రంలో రైతుల సమస్యలుంటాయా? ఇష్టమొచ్చినట్లు సొల్లు మాట్లాడుతున్నారని ఎద్దేవా చేశారు.

నేటి నుంచి మద్యం అమ్మకం

బుధవారం నుంచి రాష్ట్రమంతటా మద్యం దుకాణాలు తెరవడానికి అనుమతించామని.. కంటెయిన్‌మెంట్‌ జోన్‌లో ఉన్న 15 దుకాణాలు తప్ప మిగిలిన అన్ని మద్యం షాపులు తెరుచుకొంటాయి సీఎం తెలిపారు. మద్యం ధరలు కూడా 16 శాతం పెంచాలని నిర్ణయం తీసుకున్నామని వెల్లడించారు. చీప్‌ లిక్కర్‌పై 11 శాతం పెంచుతామని చెప్పారు. బార్లు, పబ్బులు, పర్మిట్‌రూంలు మాత్రం తెరుచుకోవని స్పష్టం చేశారు.

అందరికీ రైతు బంధు

రైతుబంధు అందరికీ ఇస్తామని.. కేసీఆర్‌ బతికి ఉన్నంత కాలం రైతుబంధు యథాతథంగా అమలవుతుందన్నారు. వానాకాలం పంటకు కూడా రూ.7 వేల కోట్లు బాజాప్తాగా ఇస్తామని చెప్పారు. రూ.25 వేల రుణం వరకూ రూ.1198 కోట్లను 2, 3 రోజుల్లో విడుదల చేస్తామని... ఇది రైతురాజ్యమని.. రైతులను ధనవంతులను చేసేదాకా ఈ ప్రభుత్వం ఊరుకోదని పేర్కోన్నారు.

15 తర్వాతే ఆర్టీసీపై నిర్ణయం

ఆర్టీసీ బస్సులను కూడా 15 వతేదీ దాకా నడపబోం. ఆ తర్వాత సమీక్షించి నిర్ణయం తీసుకుంటామని చెప్పారు. ఈ లోగా ఆరెంజ్‌ జోన్లో ఉన్న జిల్లాలు కూడా గ్రీన్‌ జోన్‌లోకి మారుతాయన్నారు. గ్రీన్‌జోన్‌లో ఆటో రిక్షాలు, క్యాబ్‌లు, ఆరెంజ్‌ జోన్‌లో క్యాబ్లు మాత్రమే తిరుగుతాయని తెలిపార. మతపరమైన సామూహిక కార్యక్రమాలకు అనుమతి లేదని.. పెళ్లిళ్లకు 20 మంది, దహన సంస్కారాలకు 10 మందికే అనుమతి ఉంటుందన్నారు.

ఇవీ చూడండి: 'కొన్ని రాష్ట్రాల తప్పుడు లెక్కలతోనే ఈ పెరుగుదల'

Last Updated : May 6, 2020, 10:21 AM IST

ABOUT THE AUTHOR

...view details