Police Instructors: పోలీసు ఉద్యోగాల భర్తీ ప్రక్రియ ఊపందుకోవడంతో తదనంతరం ఇచ్చే శిక్షణపై అధికారులు ఇప్పటి నుంచే దృష్టి సారించారు. ఒకేసారి 17వేల మందికి శిక్షణ ఇవ్వాలంటే అదే స్థాయిలో బోధకులు కూడా కావాలి. వీరికి పోలీసు శిక్షణలో బోధించాల్సిన అంశాలపై తర్ఫీదునివ్వాలి. ఇదంతా రోజుల తరబడి జరిగే ప్రక్రియ కాబట్టి అధికారులు ఇప్పటి నుంచే దృష్టి సారించారు. పోలీసు ఉద్యోగాలంటే దేహదారుఢ్యం, ఆయుధాలు పేల్చడం, దర్యాప్తు వంటి అనేక అంశాలను శిక్షణ కాలంలో బోధించాల్సి ఉంటుంది. 9 నెలలపాటు జరిగే శిక్షణలో పోలీసులను పూర్తిస్థాయిలో తీర్చిదిద్దుతారు. ఇంత పెద్ద కసరత్తు మరే ప్రభుత్వ ఉద్యోగానికీ ఉండదు.
ఖాళీలన్నీ భర్తీ!
అధికారుల అంచనా ప్రకారం భారీస్థాయిలో జరిగే నియామకాల్లో ఇదే చివరిది. భవిష్యత్తులో నియామకాలు జరిగినా ఈ స్థాయిలో మాత్రం ఉండవన్నది నిర్వివాదాంశం. తెలంగాణ వచ్చిన తర్వాత ఇప్పటి వరకూ రెండుసార్లు నిర్వహించిన నియామకాల ద్వారా దాదాపు 30 వేల మందిని పోలీసుశాఖలోకి తీసుకున్నారు. ఇప్పుడు సుమారు 17 వేల మంది నియామకం జరుపనున్నారు. తెలంగాణ పోలీసుశాఖ సిబ్బంది సంఖ్య 80 వేలు కాగా త్వరలోజరపబోయే నియామకాలతో దాదాపు ఖాళీలన్నీ భర్తీ అవుతాయి.