వచ్చే ఏడాది ఆర్థిక సంవత్సరానికి బడ్జెట్ కసరత్తు ప్రారంభం Telangana Government Exercise Budget 2024-25 :ఏప్రిల్ నుంచి కొత్త ఆర్థిక సంవత్సరం ప్రారంభం కానుంది. ఆలోగా 2024-25 (Telangana Budget 2024-25 ) ఆర్థిక సంవత్సరానికి రాష్ట్ర ప్రభుత్వం బడ్జెట్ను తయారు చేసి ఉభయ సభల ఆమోదం పొందాల్సి ఉంటుంది. ఇందుకోసం ఆర్థిక శాఖ కసరత్తు ప్రారంభించింది. బడ్జెట్ తయారీ కోసం ప్రతిపాదనలు ఇవ్వాల్సిందిగా అన్ని శాఖలకు స్పష్టం చేసింది. వచ్చే నెల తొమ్మిదో తేదీ వరకు ప్రతిపాదనలు సమర్పించాలని తెలిపింది. ఆన్‌లైన్‌లోనే ప్రతిపాదలను స్వీకరించనున్నారు.
ఇందుకోసం వెబ్‌సైట్ మంగళవారం నుంచి అందుబాటులోకి రానుంది. ప్రతిపాదనలను వచ్చే నెల 11వ తేదీ వరకు ఆర్థిక శాఖకు(TS Finance Department) సమర్పించాలని తెలిపింది. 11వ తేదీ తర్వాత ప్రతిపాదనలు సమర్పిస్తే, మార్పులు, చేర్పులకు ఇబ్బందులు ఎదురవుతుందని పేర్కొంది. బడ్జెట్ కసరత్తులో భాగంగా కేడర్ వారీగా పోస్టులు, ప్రస్తుతం ఉన్న ఉద్యోగుల వివరాలు, నిర్ణీత నమూనాలో సమర్పించాల్సి ఉంటుంది. కొత్తగా చేరే అవకాశం ఉన్న ఉద్యోగుల సంఖ్యను కూడా ఇవ్వాలన్న ఆర్థిక శాఖ, ఆరో తేదీలోపు అప్‌లోడ్ చేయాలని తెలిపింది.
CAG Report on State Finance: బడ్జెట్ నిర్వహణ తీరు బాగోలేదు.. కాగ్ ఆక్షేపణ
బడ్జెట్ కసరత్తులో భాగంగా ప్రస్తుత ఆర్థిక సంవత్సరానికి సవరించిన అంచనాలను కూడా ఇవ్వాల్సి ఉంటుంది. సవరించిన అంచనాల్లో బడ్జెట్ మొత్తంపెంచడాన్ని అంగీకరించేది లేదని ప్రభుత్వం స్పష్టం చేసింది. ప్రస్తుత పన్నులు, ధరలను దృష్టిలో ఉంచుకొని, 2024-25లో వచ్చే రాబడుల వివరాలను పేర్కొనాలి. రాబడులను పెంచుకునే విషయంతో పాటు, లీకేజీలను అరికట్టే విషయమై దృష్టి సారించాలని ఆర్థిక శాఖ తెలిపింది.
Telangana Budget 2024-25 : అదేవిధంగా లక్ష్యాలు నిర్దేశించాలని ఆర్థిక శాఖ స్పష్టం చేసింది. రానున్న ఆర్థిక సంవత్సరంలో వ్యయం అయ్యే మొత్తానికి సంబంధించిన వివరాలను నిర్వహణా వ్యయం, పథకం వ్యయం కింద ఇవ్వాల్సి ఉంటుంది. రాష్ట్ర ప్రభుత్వ ప్రాధాన్యాలు మారిన నేపథ్యంలో అందుకు అనుగుణంగా పథకాలకు కేటాయింపులు ప్రతిపాదించాలని తెలిపింది. ఆ అవసరాలను దృష్టిలో ఉంచుకొని, సమీక్షించుకొని ప్రతిపాదనలు రూపొందించాలని ఆర్థికశాఖ స్పష్టం చేసింది.
వాస్తవ అవసరాలకు అనుగుణంగానే ఉండాలి : ఏవైనా కొత్త పథకాలు ప్రతిపాదిస్తే అవి ప్రారంభమయ్యే అవకాశం ఉన్న తేదీ, అంచనా వ్యయం తదితర వివరాలను పొందుపర్చాలని ఆర్థికశాఖ తెలిపింది. డిసెంబర్ 31వ నాటికి పథకాల వారీగా చేయాల్సిన చెల్లింపులు, వాటి వివరాలను కూడా ఆన్‌లైన్‌లో నమోదు చేయాలని పబ్లిక్ వర్క్స్ విభాగాలకు స్పష్టం చేసింది. ఆ వివరాలను కచ్చితంగా, వాస్తవ అవసరాలకు అనుగుణంగానే ఉండాలని పేర్కొంది. ప్రస్తుతం కొనసాగుతున్న పనులకు సంబంధించిన వివరాలను, ఒప్పందాల వారీగా ఇవ్వాలని వివరించింది.
రాష్ట్ర ఆర్థికశాఖపై సీఎం రేవంత్రెడ్డి సమీక్ష - '2024-25 బడ్జెట్లో వాస్తవాలు ప్రతిబింబించాలి'
పథకాలకు సంబంధించి రాష్ట్ర ఆవిర్భావం మొదలు, ఏడాది వారీగా వ్యయం, లబ్ధిదారుల సంఖ్య, సంబంధిత వెబ్‌సైట్ల వివరాలు పేర్కొనాలని ఆర్థికశాఖ సూచించింది. కేంద్ర ప్రభుత్వ ప్రాయోజిత పథకాలను పూర్తి స్థాయిలో వినియోగించుకోవాలని, రాష్ట్ర పథకాలతో అనుసంధానమయ్యే వాటిని పరిగణలోకి తీసుకొని ప్రతిపాదనలు రూపొందించాలని పేర్కొంది. శాఖలు ఇచ్చే ప్రతిపాదనలు వాస్తవాలకు అనుగుణంగా ఉండాలని, ఊహజనితంగా ఉండరాదని తెలిపింది. శాఖల వారీగా గ్రాంట్ల వ్యయాన్ని హేతుబద్దీకరించాలని, నిర్వహణా వ్యయాన్ని క్రోడీకరించాలని పేర్కొంది.
TS Budget 2024 Exercise : రాష్ట్ర ఏర్పాటు మొదలు శనివారం వరకు తీసుకున్న అన్ని అప్పులకు సంబంధించిన వివరాలను, పొందుపర్చాలని ఆర్థికశాఖ స్పష్టం చేసింది. ప్రభుత్వ శాఖలతోపాటు కార్పొరేషన్లు, స్పెషల్ పర్సస్ వెహికిల్స్ ద్వారా తీసుకున్న అన్ని రుణాల వివరాలు ఇవ్వాలని తెలిపింది. పాలనలో పారదర్శకతకు ప్రభుత్వం కట్టుబడి ఉందని, రుణాలకు సంబంధించి ఎక్కడైనా వివరాలు అందకపోతే తీవ్రంగా పరిగణించనున్నట్లు హెచ్చరించింది. ఎఫ్‌ఆర్‌బీఎం నిబంధనలకు సంబంధించిన వివరాలను కూడా పేర్కొనాలని వివరించింది. ఆయా శాఖలకు సంబంధించిన అన్ని బ్యాంకు ఖాతాల వివరాలను సమర్పించాలని, ఆస్తులకు సంబంధించిన వివరాలు ఇవ్వాలని ఆర్థికశాఖ వెల్లడించింది.
రాష్ట్ర సర్కారు ప్రగతి ప్రస్థానానికి కొనసాగింపుగా.. మరోమారు భారీ బడ్జెట్
కేంద్ర బడ్జెట్ నిధుల కేటాయింపుల్లో ఉపాధి హామీకి కోత