Govt Jobs: రాష్ట్రంలో ఈసారి ఉద్యోగ నియామకాలను పక్కాగా పూర్తిచేయాలని రాష్ట్ర ప్రభుత్వం భావిస్తోంది. పోస్టులు మిగలకుండా అన్నింటినీ భర్తీ చేయాలని చూస్తోంది. అభ్యర్థులు గడువులోగా విధుల్లో చేరకపోతే వారిని వదిలేసి ప్రాధాన్య క్రమంలో మిగిలిన అర్హులకు అవకాశం ఇవ్వాలని యోచిస్తున్నట్లు తెలిసింది. దీని విధివిధానాలపై కసరత్తు చేస్తోంది.
గత అనుభవాల దృష్ట్యా..
గతంలో వివిధ నియామకాల్లో ఎంపికైన అభ్యర్థులు విధుల్లో చేరకపోతే చాలా పోస్టులు ఖాళీగా మిగిలిపోయేవి. వాటిని మిగులు పోస్టులుగా తేల్చి మళ్లీ నోటిఫికేషన్ ఇచ్చినప్పుడు మాత్రమే భర్తీ చేసేవారు. ఒకసారైతే వివిధ పోటీ పరీక్షలు రాసిన అభ్యర్థుల్లో దాదాపు 500 మందికి పైగా ఒకటికి మించి ఉద్యోగాలకు ఎంపికయ్యారు. వారు విధుల్లో చేరని కారణంగా వివిధ శాఖల్లో 500 పోస్టులు భర్తీ కాలేదు. అర్హులు ఎందరో ఉన్నా మళ్లీ నోటిఫికేషన్ ఇచ్చాకే భర్తీ చేయాలని ప్రభుత్వం అప్పట్లో నిర్ణయించింది. దీంతో ఆ 500 పోస్టుల్లో ఎవరికీ అవకాశం దక్కలేదు. ఉద్యోగాన్వేషణలో అభ్యర్థులు ఒకటికి మించి పోస్టులకు ప్రయత్నించడం మామూలే. కొందరు రెండు, మూడు పోస్టులకు ఎంపికవుతుంటారు. చివరకు నచ్చిన పోస్టును ఎంచుకొని, మిగిలిన వాటిని వదిలేస్తారు. దీంతో అవన్నీ ఖాళీగా ఉండిపోతున్నాయి. ఆశావహులైన నిరుద్యోగులు తర్వాతి నోటిఫికేషన్ వరకు ఉద్యోగాలు పొందలేకపోతున్నారు. ఇలాంటి పరిస్థితిని నివారించాలని ప్రభుత్వం భావిస్తోంది. ఇందుకోసం అవసరమైన ప్రతిపాదనలను రూపొందించాలని అధికారులకు సూచించింది. అధికారులు పరిష్కార మార్గాలను పరిశీలిస్తున్నారు.
అధికారులు మరింత కసరత్తు చేసి నోటిఫికేషన్లలోని పోస్టులు ఏ మాత్రం మిగలకుండా చూడడం కోసం మరికొన్ని ప్రతిపాదనలు కూడా రూపొందించనున్నారని తెలుస్తోంది. వాటిలో మెరుగైన విధానాన్ని ఖరారు చేసి ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేస్తుంది.