రాష్ట్ర ప్రభుత్వం రెవెన్యూ శాఖలో కీలక మార్పులు చేస్తోంది. ఆర్ఒఆర్-2020 చట్టంతో రెవెన్యూ సంస్కరణలకు తెరతీసిన ప్రభుత్వం రెవెన్యూ కోర్టులను పూర్తిగా రద్దు చేయనుంది. ఏళ్ల తరబడి తేలకుండా రెవెన్యూ కోర్టుల్లో వ్యాజ్యాలు కొనసాగడం, క్షేత్ర స్థాయిలో భూ వివాదాలు పెరుగుతుండటంపై ప్రభుత్వం దృష్టి సారించింది. వేగంగా, పారదర్శకంగా తీర్పులు ఇచ్చేలా రెవెన్యూ కోర్టుల స్థానంలో ల్యాండ్ ట్రైబ్యునళ్లను ఏర్పాటు చేయాలని నిర్ణయించింది.
జిల్లాకో ల్యాండ్ ట్రైబ్యునల్
జిల్లాకు ఒకటి చొప్పున రాష్ట్రంలోని 33 జిల్లాల్లోనూ వీటిని నెలకొల్పుతారు. ఇప్పటి వరకు భూ యాజమాన్య హక్కుల కల్పన చట్టం (ఆర్ఒఆర్) కింద తహసీల్దారు, ఆర్డీవో, సంయుక్త కలెక్టర్లు (ప్రస్తుతం అదనపు కలెక్టర్లు) రెవెన్యూ కోర్టులను నిర్వహిస్తున్నారు. ఆ పైన భూ పరిపాలన కమిషనర్, రెవెన్యూ మంత్రి వరకు అప్పీళ్లకు అవకాశం ఉంది. భూ వివాదాల్లో ఇరు వర్గాలకు నోటీసులు జారీ చేయడం, తీర్పులు ఇచ్చి వివాద పరిష్కారం చేసే అధికారాలు దిగువ స్థాయిలో ఉన్నాయి.
ఏళ్ల తరబడి తేలని కేసులు
ఈ నేపథ్యంలో తహసీల్దారు నుంచి సంయుక్త కలెక్టర్ వరకు ఉన్న కోర్టుల్లో పలు రకాల కేసుల విచారణ తేలడం లేదని ప్రభుత్వం గమనించింది. వివాదాలకు పరిష్కారం లభించక ఏళ్లతరబడి భూ యజమానులు కార్యాలయాల చుట్టూ తిరగడం, చివరికి అప్పీళ్లకు పై కోర్టులను ఆశ్రయిస్తున్నారని గుర్తించింది. ఈ క్రమంలో తహసీల్దారు నుంచి సంయుక్త కలెక్టర్ వరకు ఉన్న కోర్టులను ప్రభుత్వం రద్దు చేస్తోంది. కొత్త చట్టంతో వారి అధికారాలకు కత్తెర పడనుంది. వాటి స్థానంలో జిల్లా స్థాయిలో ట్రైబ్యునళ్లు పనిచేయనున్నాయి.
వివరాలు సేకరించిన ప్రభుత్వం
కొద్ది రోజుల క్రితం రాష్ట్రంలో పెండింగ్లో ఉన్న కేసుల వివరాలపై భూ పరిపాలన ప్రధాన కమిషనర్ (సీసీఎల్ఏ) జిల్లా కలెక్టర్లను నివేదిక కోరారు. వివిధ కోర్టుల్లో నమోదైనవి, వాదోపవాదాలు జరుగుతున్నవి, అప్పీళ్లకు వెళ్లినవి.. ఇలా పూర్తి వివరాలను ప్రభుత్వం తెప్పించుకుంది. కొన్ని జిల్లాల్లో పెద్ద ఎత్తున కేసులు కొనసాగుతున్నట్లు ఈ సందర్భంగా ఉన్నతాధికారులు గుర్తించారు.