తెలంగాణ

telangana

ETV Bharat / state

Land Values in TS: చివరి దశకు భూములు, ఆస్తుల విలువల పెంపు ప్రక్రియ - ts news

Land Values in TS: వ్యవసాయ, వ్యవసాయేతర భూములు, ఆస్తుల విలువల పెంపు ప్రక్రియ చివర దశకు చేరుకుంది. బహిరంగ విలువలను బట్టి రిజిస్ట్రేషన్ల విలువల పెంపు శాతాలను ఖరారు చేసిన స్టాంపులు రిజిస్ట్రేషన్లశాఖ.. అధిక ప్రాధాన్యత కలిగిన గ్రామాల్లో వ్యవసాయ భూములపై 50శాతం కంటే ఎక్కువ పెంచింది. ఇవాళ సాయంత్రంలోపు విలువల పెంపు కమిటీల నుంచి ఆమోదముద్ర వేయించుకునే దిశలో చర్యలు చేపట్టింది. రిజిస్ట్రేషన్ల ఆదాయంలో దాదాపు 80శాతం తెచ్చి పెడుతున్న 6జిల్లాలపై ప్రత్యేక దృష్టి పెట్టింది.

Land Values in TS: చివరి దశకు భూములు, ఆస్తుల విలువల పెంపు ప్రక్రియ
Land Values in TS: చివరి దశకు భూములు, ఆస్తుల విలువల పెంపు ప్రక్రియ

By

Published : Jan 29, 2022, 3:36 AM IST

Land Values in TS: రాష్ట్రంలో శరవేగంగా సాగుతున్న వ్యవసాయ, వ్యవసాయేతర భూములు, ఆస్తుల విలువల పెంపు ప్రక్రియ చివర దశకు చేరింది. శుక్రవారం హైదరాబాద్‌, రంగారెడ్డి, మేడ్చల్‌ మల్కాజిగిరి, సంగారెడ్డి, యాదాద్రి జిల్లాలకు చెందిన జిల్లా రిజిస్ట్రార్లతో స్టాంపులు రిజిస్ట్రేషన్లశాఖ కమిషనర్‌ శేషాద్రి ప్రత్యేకంగా సమావేశమయ్యారు. విలువల పెంపు వివరాలను అందజేసిన కమిషనర్‌ ఇవాళ సాయంత్రంలోపు కమిటీల ఆమోదం పొందేటట్లు చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ఇప్పటికే సీఎస్​ సోమేశ్‌కుమార్‌ విలువల పెంపునకు చెందిన ఆయా కమిటీల ఆమోదముద్ర వేయించడంలో జాప్యం జరగకుండా కలెక్టర్లకు స్పష్టమైన ఆదేశాలు ఇచ్చారు. ఆర్డీఓలు, జాయింట్‌ కలెక్టర్లు నేతృత్వం వహిస్తున్న విలువల పెంపు కమిటీలు వీలైనంత త్వరగా ఆమోదముద్ర వేసే ప్రక్రియ పూర్తి చేయనున్నాయి. కొత్త మార్కెట్​ విలువలు ఫిబ్రవరి 1 నుంచి అమల్లోకి రానున్నాయి.

వ్యవసాయ భూములకు సంబంధించి 50శాతం

రాష్ట్రంలో ప్రస్తుతం అమలవుతున్న రిజిస్ట్రేషన్‌ మూల విలువలను వ్యవసాయ భూములకు సంబంధించి 50శాతం, ఖాళీ స్థలాలకు 35శాతం, అపార్ట్‌మెంట్లపై 25శాతం లెక్కన పెంచుతున్నట్లు స్టాంపులు రిజిస్ట్రేషన్లశాఖ అధికార వర్గాలు వెల్లడించాయి. రాష్ట్రవ్యాప్తంగా వ్యవసాయ భూముల బహిరంగ విలువలు అత్యధికంగా పెరిగిన 600లకుపైగా గ్రామాలను గుర్తించిన స్టాంపులు, రిజిస్ట్రేషన్లశాఖ.. అక్కడ మాత్రం 50శాతం కంటే ఎక్కువ పెంచింది. వ్యవసాయ భూములు, ఖాళీ స్థలాలు, అపార్ట్‌మెంట్లు ఈ మూడు విభాగాలకు సంబంధించి రిజిస్ట్రేషన్‌ శాఖ పెంపు శాతాలు విశ్వసనీయ వర్గాల ద్వారా బహిర్గతమయ్యాయి. వ్యవసాయ భూమి ఎకరం 5కోట్ల రూపాయల వరకు విలువ కలిగిన వాటి రిజిస్ట్రేషన్ల విలువలపై 50శాతం, 5కోట్ల నుంచి 10కోట్ల మధ్య విలువ కలిగిన భూములకు సంబంధించి 20శాతం, 20 కోట్లు అంతకంటే ఎక్కువ విలువ కలిగిన భూములకు 10శాతం లెక్కన పెంచింది.

రిజిస్ట్రేషన్​ విలువల పెంపు ఇలా..

ఖాళీ స్థలాలు చదరపు గజం 20వేల రూపాయలలోపు విలువ ఉన్నట్లయితే రిజిస్ట్రేషన్ల విలువలపై 35శాతం, చదరపు గజం 20వేల నుంచి 40వేల మధ్య ఉంటే 15శాతం, చదరపు గజం 40వేలు అంతకంటే ఎక్కువ విలువ కలిగిన ఖాళీ స్థలాల రిజిస్ట్రేషన్‌ విలువలపై 10శాతం లెక్కన పెంచినట్లు తెలుస్తోంది. అపార్ట్‌మెంట్లు, ఇళ్లు, వ్యాపార సముదాయాలకు సంబంధించి చదరపు అడుగు వెయ్యి నుంచి 4వేల రూపాయల మధ్య విలువ కలిగిన అపార్ట్‌మెంట్లకు రిజిస్ట్రేషన్ల విలువలపై 25శాతం, చదరపు అడుగు 4వేల నుంచి 4800 మధ్య విలువ కలిగిన అపార్ట్‌మెంట్లకు రిజిస్ట్రేషన్ల విలువలపై 15శాతం, చదరపు అడుగు 4800రూపాయలు అంతకు మించి విలువ కలిగి ఉంటే రిజిస్ట్రేషన్ల విలువలపై 10శాతం లెక్కన పెంచినట్లు తెలుస్తోంది.

ఆ జిల్లాలపై ప్రత్యేక దృష్టి

రాష్ట్రంలో రిజిస్ట్రేషన్ల ద్వారా వచ్చే ఆదాయంలో దాదాపు 80శాతం హైదరాబాద్‌ చుట్టుపక్కల జిల్లాల నుంచే వస్తున్నట్లు అధికారులు అంచనా వేశారు. అత్యధికంగా ఆదాయం వస్తున్న జిల్లాలను వరుసగా తీసుకుంటే... మొదటి స్థానంలో రంగారెడ్డి జిల్లా ఉండగా.. రెండో స్థానంలో మేడ్చల్‌ మల్కాజిగిరి, మూడో స్థానంలో హైదరాబాద్‌ ఉన్నాయి. ఆ తర్వాత వరుస స్థానాల్లో మెదక్‌, యాదాద్రి, వరంగల్‌ పట్టణ జిల్లాలు ఉన్నాయి. ఈ జిల్లాలపై స్టాంపులు రిజిస్ట్రేషన్లశాఖ ప్రత్యేక దృష్టి సారించి లోటుపాట్లు లేకుండా నూతన విలువలు అమలయ్యేట్లు చర్యలు తీసుకుంటోంది. పెంపు ద్వారా ఏడాదికి 2500 కోట్ల నుంచి 3వేల కోట్ల వరకు వస్తుందని ప్రాథమికంగా అంచనా వేసినట్లు అధికారులు తెలిపారు.

ఇదీ చదవండి:

ABOUT THE AUTHOR

...view details