ఎస్సీ, ఎస్టీ యువత పారిశ్రామికవేత్తలుగా ఎదిగేలా అవసరమైన సహకారంతో పాటు ఉద్యోగ అవకాశాల కల్పనకు ముఖ్యమంత్రి కట్టుబడి ఉన్నారని.. రాష్ట్ర ప్రభుత్వం తరపున పూర్తి సహాయ సహకారాలు అందుతాయని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్ తెలిపారు.
'ఎస్సీ, ఎస్టీ యువతను పారిశ్రామికవేత్తలుగా తీర్చిదిద్దుతాం' - CS Somesh Kumar Latest News
దళిత్ ఇండియన్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీ ప్రతినిధులు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్‌ను కలిశారు. ఎస్సీ, ఎస్టీ యువతను పారిశ్రామికవేత్తలుగా ప్రభుత్వం తీర్చిదిద్దుతోందని సీఎస్ పేర్కొన్నారు. డిక్కీ చేపట్టే కార్యక్రమాలకు రాష్ట్ర ప్రభుత్వ సహకారం ఉంటుందని వెల్లడించారు.
దళిత్ ఇండియన్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీ - డిక్కీ బృందం సచివాలయంలో సీఎస్‌ను కలవగా... వివిధ రంగాల్లో ఎస్సీ, ఎస్టీ యువత రాణించేందుకు, డిక్కీ ద్వారా చేపట్టే ఎంటర్ ప్రెన్యూర్ షిప్ కార్యక్రమాలకు ప్రభుత్వ సహకారం ఉంటుందని హామీ ఇచ్చారు. వివిధ పరిశ్రమల్లో డిక్కీ ఇన్నోవేటివ్ ఐడియాలు అమలు చేస్తున్నందుకు అభినందించిన ప్రధాన కార్యదర్శి... ఎస్సీ, ఎస్టీ పారిశ్రామికవేత్తలు జాతీయ స్ధాయిలో ఆదర్శంగా నిలవాలని ఆశాభావం వ్యక్తం చేశారు.
ముఖ్యమంత్రి ఎస్టీ ఎంటర్ ప్రెన్యూర్ ఇన్నోవేషన్ ద్వారా ప్రభుత్వం విజయవంతంగా శిక్షణ అందిస్తోందన్నారు. కేటీఆర్ నేతృత్వంలో పరిశ్రమల రంగం గణనీయమైన పురోగతిని సాధించిందని సోమేశ్ కుమార్ వివరించారు. ఎంటర్ ప్రెన్యూర్‌షిప్ రంగంలో నూతన ఆలోచనలు, ఆవిష్కరణలకు కృషి చేయాలని సీఎస్ సూచించారు.