తెలంగాణ ఆవిష్కరణల విభాగం (టీఎస్‌ఐసీ) ద్వారా దరఖాస్తులను ఆహ్వానించింది. ప్రస్తుతం వృద్ధులు, దివ్యాంగులు వాడే ఉపకరణాలు తక్కువ సంఖ్యలో అందుబాటులో ఉన్నాయి. ఈ నేపథ్యంలో నూతన పరికరాలు, యంత్రాల ఆవిష్కరణలు జరిగేలా ప్రభుత్వపరంగా చర్యలు తీసుకోవాలని పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్ ఆధ్వర్యంలో ఇటీవల జరిగిన ఉన్నతస్థాయి సమావేశంలో నిర్ణయించారు. మంత్రి ఆదేశాల మేరకు టీఎస్‌ఐసీ, ఐటీ శాఖలు ప్రణాళిక రూపొందించాయి.
14 వరకు దరఖాస్తులకు అవకాశం..
ఆవిష్కర్తలు, అంకుర పరిశ్రమలు, విద్యార్థులు నవంబరు 14లోగా తమ ప్రతిపాదనల నమూనాలను తెలియజేస్తూ teamtsic.org/at-summit-exhibition ద్వారా ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలి. తెలంగాణ నివాసులు, ఇక్కడి విద్యాసంస్థల్లో చదివే విద్యార్థులు అర్హులు. ఆవిష్కర్తలు వ్యక్తిగతంగా లేదా బృందంగా తయారు చేసి నమూనాతో పంపవచ్చు. వీటిలో అర్హమైన వాటిని ఎంపిక చేసి ఆన్‌లైన్‌లో జరిగే రాష్ట్రస్థాయి సహాయ సాంకేతిక సదస్సులో ప్రదర్శిస్తారు. వాటిని నిపుణులు, పెట్టుబడిదారులు, మార్కెటింగ్ సంస్థల ప్రతినిధులు పరిశీలిస్తారు.
అవసరమైన మార్పులు, చేర్పులతో పాటు సలహాలు, సూచనలు అందించి పరికరాల తయారీ, పెట్టుబడులు, క్రయవిక్రయాలు, ఎగుమతుల మార్కెటింగ్‌కు కార్యాచరణ రూపొందిస్తారు. ఈ కార్యక్రమం ద్వారా దివ్యాంగులు, వృద్ధుల సమస్యలకు పరిష్కారం లభిస్తుందని పరిశ్రమలు, ఐటీ శాఖ ముఖ్యకార్యదర్శి జయేశ్‌రంజన్, టీఎస్‌ఐసీ ముఖ్య ఆవిష్కరణల అధికారి రవినారాయణ్ తెలిపారు.
ఇదీ చూడండి:మాజీ మంత్రి నాయిని నర్సింహారెడ్డి సతీమణి కన్నుమూత