కరెంటు ఛార్జీల పెంపుపై ప్రతిపాదనలివ్వాలని ప్రభుత్వం సూచించడంతో డిస్కంలు లెక్కల సేకరణ కసరత్తు ప్రారంభించాయి. రాష్ట్రంలో ఒక్కో యూనిట్ సరఫరాకు సగటు వ్యయం(ఏసీఎస్) రూ.7.14 అవుతోందని తాజా అధ్యయనంలో వెల్లడైంది. ఈ ఖర్చుతో పోలిస్తే ఆదాయం సగటున 21 పైసలు తక్కువగా వస్తున్నందున విద్యుత్ పంపిణీ సంస్థ(డిస్కం)లు నష్టపోతున్నట్లు కేంద్ర విద్యుత్ శాఖ నివేదికలో వెల్లడించింది. తెలంగాణలో విద్యుత్ డిమాండు, వినియోగం గణనీయంగా పెరగడంతో బహిరంగ మార్కెట్‌లో కొని సరఫరా చేసినందుకు ఏసీఎస్ అధికమవుతోంది. సరఫరా వ్యయం పెరుగుతున్నా.. గత ఐదేళ్లుగా ఛార్జీలను పెంచలేదని, ఆర్థికలోటు ఎక్కువగా ఉందని డిస్కంలు సర్కారుకు నివేదించాయి.
మధ్యతరగతి ప్రజలపై ఇప్పటికే భారం
రాష్ట్రంలో మొత్తం కోటీ 62 లక్షల కరెంటు కనెక్షన్లలో 73 శాతం ఇళ్లకే ఉన్నాయి. కానీ, మొత్తం ఆదాయంలో ఇళ్ల కనెక్షన్ల నుంచి వచ్చేది 35 శాతంలోపే ఉంటోంది. 50 యూనిట్లలోపు వాడితే యూనిట్‌కు రూ.1.45 చొప్పున ఛార్జీ వసూలు చేస్తున్నారు. సగటున నెలకు 200 యూనిట్లలోపు వాడేవారి నుంచి యూనిట్‌కు రూ.5లోపే వసూలుచేస్తున్నామని డిస్కంలు తెలిపాయి. మొత్తం ఇళ్ల కనెక్షన్లు కోటీ 14 లక్షలుంటే వారిలో 200 యూనిట్లలోపు వాడేవారే 87 శాతం ఉన్నందున.. నష్టం అధికంగా వస్తోందని అంచనా. ఈ నష్టాలను పూడ్చడానికే ఛార్జీలను పెంచాలని ప్రభుత్వాన్ని కోరాయి. మరోవైపు నెలకు 300 యూనిట్లకుపైగా వాడే ఇళ్ల నుంచి ‘సగటు వ్యయం’ కన్నా ఎక్కువగా వసూలుచేస్తున్నందున మధ్యతరగతి ప్రజలపై ఇప్పటికే భారం అధికంగా ఉంది.
నష్టాల పెరుగుదలకు ప్రధాన కారణాలు..