తెలంగాణ

telangana

ETV Bharat / state

Dalit bandhu implementation : రాష్ట్రవ్యాప్తంగా దళితబంధు అమలుకు ప్రభుత్వం కసరత్తు

Dalit bandhu implementation : రాష్ట్రవ్యాప్తంగా దళితబంధు అమలుకు సర్కారు సమాయత్తమవుతోంది. నియోజకవర్గానికి 100 కుటుంబాల చొప్పున ఎంపిక చేసి, ఒక్కొక్కరికి 10 లక్షల విలువైన యూనిట్లు మంజూరు చేయనుంది. మార్చి నాటికి యూనిట్లు ఏర్పాటయ్యేలా త్వరలో నిధులు విడుదల చేయనున్నట్లు తెలిసింది.

Dalit bandhu
Dalit bandhu

By

Published : Dec 30, 2021, 5:46 AM IST

Updated : Dec 30, 2021, 6:49 AM IST

Dalit bandhu implementation : రాష్ట్రవ్యాప్తంగా దళితబంధు అమలుకు ప్రభుత్వం కసరత్తు ముమ్మరం చేసింది. నియోజకవర్గానికి 100 కుటుంబాలు చొప్పున ఎంపిక చేసి, ఒక్కొక్కరికి రూ. 10 లక్షల విలువైన యూనిట్లు మంజూరు చేయనుంది. హుజూరాబాద్‌ నియోజకవర్గంలో ఇప్పటికే పథకం అమలైనందున మిగతా 118 నియోజకవర్గాల్లో జనవరి నుంచి అర్హులైన లబ్ధిదారులను గుర్తించి, మార్చి నాటికి యూనిట్లు ఏర్పాటయ్యేలా త్వరలో నిధులు విడుదల చేయనున్నట్లు తెలిసింది. పైలెట్‌ ప్రాజెక్టు కింద అదనంగా గుర్తించిన చింతకాని (మధిర నియోజకవర్గం, ఖమ్మం జిల్లా), తిరుమలగిరి (తుంగతుర్తి, సూర్యాపేట), చారకొండ (అచ్చంపేట, నాగర్‌ కర్నూల్‌), నిజాంసాగర్‌ (జుక్కల్‌, కామారెడ్డి) మండలాల్లో పథకం అమలు కోసం ఇప్పటికే రూ. 250 కోట్లు విడుదల చేసింది. ఈ మండలాలు ఉన్న నియోజకవర్గాలకు అదనంగా 100 యూనిట్లు మంజూరు చేసి రాష్ట్రవ్యాప్తంగా పథకం అమల్లో భాగం చేస్తోంది.

ఎంపిక ఎలా చేస్తారో......

రాష్ట్రవ్యాప్తంగా నియోజకవర్గానికి వందమంది చొప్పున మొత్తం లబ్ధిదారులకు రూ. 1,180 కోట్లు అవసరమని సర్కారు అంచనా వేస్తోంది. వీలైనంత త్వరగా నిధులు సర్దుబాటు చేయాలని ఆర్థికశాఖను కోరింది. ఈ పథకం అమలు కోసం ముఖ్యమంత్రి కేసీఆర్‌ పరిశీలనలో రెండు ప్రతిపాదనలు ఉన్నట్లు తెలిసింది. నియోజకవర్గానికి వందమందిని ఎమ్మెల్యేల ఆధ్వర్యంలో ఎంపిక చేయడమా? లేదా వంద కుటుంబాలు వచ్చేలా ఒకటి లేదా రెండు గ్రామాలను ఎంపిక చేసి దళితబంధు ఆదర్శ గ్రామాల కింద ప్రకటించి అమలు చేయాలా? అనే విషయమై సీఎం నిర్ణయం తీసుకోనున్నట్లు సమాచారం.

ప్రగతి మేరకు నిధులు..

implement Dalit bandhu across the state : హుజూరాబాద్‌ నియోజకవర్గంలో ఇప్పటికే 800 మంది లబ్ధిదారులు డెయిరీ యూనిట్లకు దరఖాస్తు చేసుకున్నారు. పశువులకు గడ్డికి కొరత లేకుండా సొంత భూములున్న వారికి ప్రభుత్వం ప్రాధాన్యం ఇస్తోంది. తొలుత షెడ్డు నిర్మాణానికి రూ. 1.50 లక్షలు విడుదల చేసి, దాని నిర్మాణం పూర్తయితేనే తదుపరి నిధులు ఇచ్చేలా మార్గదర్శకాలు జారీ అయ్యాయి. తొలివిడత నాలుగు గేదెలు, తరువాత ఆరునెలలకు మరో నాలుగు గేదెల కొనుగోలుకు అనుమతివ్వనుంది. లబ్ధిదారు ప్రస్తుత యూనిట్‌కు అదనంగా మరో యూనిట్‌ (ఆటో, గొర్రెలు తదితరాలు) ఏర్పాటు చేసుకునేందుకు వీలుగా నిబంధనలు రూపొందించింది. యూనిట్‌ పూర్తిగా ఏర్పాటయ్యాక దళితబంధు ఖాతాలోని మిగిలిన సొమ్ము, ఆ సొమ్ముపై జమ అయిన వడ్డీని నిర్వహణ కోసం వాడుకునే అవకాశాన్ని ఇవ్వాలని బ్యాంకును ఆదేశించింది.

ఇదీ చూడండి:Interest on Dalit Bandhu Funds : దళితబంధు అమలయ్యే దాకా వడ్డీ చెల్లింపు

Last Updated : Dec 30, 2021, 6:49 AM IST

ABOUT THE AUTHOR

...view details