రాష్ట్రవ్యాప్తంగా వేగంగా పెరుగుతున్న పట్టణీకరణ నేపథ్యంలో అసలు లేఅవుట్ సక్రమమా... అక్రమమా అనేది కూడా చాలామంది ఆలోచించడం లేదు. ప్రస్తుతానికది అక్రమమైనా మున్ముందు క్రమబద్ధీకరణకు ప్రభుత్వం అవకాశం ఇస్తుందిలే అనే ధీమాతో కొందరు కొనేస్తున్నారు. ఇలాంటి చోట ధరలు తక్కువగా ఉండటం, ఇప్పటికిప్పుడు నిర్మాణాలు చేయకపోయినా భవిష్యత్ అవసరాలకు ఉంటుందనే నమ్మకంతో ప్లాట్లను తీసుకుంటున్నారు. ప్రభుత్వం తాజాగా అనధికార లేఅవుట్‌లలో ప్లాట్ల రిజిస్ట్రేషన్‌పై కొరడా ఝుళిపించింది. ఈ నేపథ్యంలోనే ఇలాంటి ప్లాట్లను రిజిస్ట్రేషన్ చేయవద్దని స్టాంపులు, రిజిస్ట్రేషన్ శాఖ ఉత్తర్వులు జారీ చేసింది. ఇప్పటికే రిజిస్టర్ అయిన ప్లాట్లను ఇకపై రిజిస్ట్రేషన్ చేయకూడదని ఆదేశించింది. దీంతో అనధికార లేఅవుట్‌లలో ప్లాట్లను కొన్నవారు ఆందోళన చెందుతున్నారు.
ఇప్పటిదాకా క్రమబద్ధీకరణ ఇలా...
రాష్ట్రంలో పట్టణాలు, నగరాలు, మాస్టర్ ప్లాన్ పరిధిలోకి వచ్చే పంచాయతీల్లో అక్రమ లేఅవుట్‌ల క్రమబద్ధీకరణ(ఎల్‌ఆర్‌ఎస్)కు అవకాశం ఇస్తూ 2015 నవంబరు రెండో తేదీన ప్రభుత్వం జీవో 151 జారీ చేసింది. దరఖాస్తు చేసుకునేందుకు వివిధ దఫాలుగా 2016 డిసెంబరు 31 వరకూ అవకాశం కల్పించింది. దరఖాస్తుల పరిష్కారానికి కూడా గత ఏడాది డిసెంబరు 31 వరకూ పలు దఫాలుగా గడువు పొడిగించింది. తాజాగా కొత్త పురపాలక సంఘాలు, నగర పాలక సంస్థల ఏర్పాటు నేపథ్యంలో వందల గ్రామాలు పట్టణ స్థానిక సంస్థల పరిధిలోకి వచ్చాయి. దీంతో పురపాలకశాఖ కొత్త పురపాలక సంఘాలు, విలీన గ్రామాల్లో ఎల్‌ఆర్‌ఎస్‌కు అవకాశం కల్పించింది.
3,892 అక్రమ లేఅవుట్‌లు
రాష్ట్ర పురపాలక శాఖ ఈ ఏడాది ఫిబ్రవరి 24 నుంచి మార్చి నాలుగో తేదీ వరకూ నిర్వహించిన పట్టణ ప్రగతి కార్యక్రమంలో అక్రమ లేఅవుట్‌లపై ప్రత్యేకంగా సర్వే చేసింది. మొత్తం 22,076 ఎకరాల్లో 3,892 అకమ్ర లేఅవుట్‌లు.. వీటిలో 2,81,171 ప్లాట్లు ఉన్నట్లు గుర్తించారు. ఈ నేపథ్యంలోనే కొత్త పురపాలక సంఘాలు, విలీన గ్రామాలలో ఎల్‌ఆర్‌ఎస్‌కు గడువు పొడిగించారు. క్రమబద్ధీకరణకు అవకాశం ఇచ్చినా పదిశాతం కూడా దరఖాస్తులు రాలేదని కూడా అధికారుల దృష్టికొచ్చింది. నిబంధనల మేరకు ఉన్న లేఅవుట్‌లు కూడా కొన్నిచోట్ల క్రమబద్ధీకరణకు దూరంగా ఉన్నట్లు అధికారులు గుర్తించారు.