Sustainable Development Goals: కేంద్ర ప్రభుత్వం విడుదల చేసిన ఆర్థిక సర్వేలో సుస్థిర అభివృద్ధి లక్ష్యాల సాధన పురోగతిని కూడా వివరించింది. రాష్ట్రాల వారీగా ఆయా లక్ష్యాల సాధనలో ప్రస్తుత స్థితిని స్పష్టం చేసింది. 75 స్థానాలతో కేరళ అగ్రస్థానంలో నిలిచింది. మొత్తం 15 రాష్ట్రాలు 65కు పైగా పాయింట్లు సాధించి ఫ్రంట్ రన్నర్ జాబితాలో నిలిచాయి. 69 పాయింట్లతో తెలంగాణ, గుజరాత్ సంయుక్తంగా ఆరో స్థానంలో నిలిచాయి. జాతీయ సగటు 66 పాయింట్లు కంటే తెలంగాణ 3 పాయింట్లు అధికంగా సాధించింది.
వందకు వంద పాయింట్లు..
మొత్తం 15 లక్ష్యాలకు గాను ఒక్క దానిలో మాత్రమే రాష్ట్రం.. వందకు వంద పాయింట్లు సాధించింది. అఫార్డబుల్ అండ్ క్లీన్ ఎనర్జీ లక్ష్యాన్ని పూర్తి స్థాయిలో చేరుకుంది. పరిశుభ్రమైన నీరు, పారిశుద్ధ్యం విషయంలో 96 పాయింట్లు సాధించింది. భూమిపై జీవనానికి సంబంధించి 81 పాయింట్లు వచ్చాయి. 65కు పైగా పాయింట్లతో తొమ్మిది లక్ష్యాల విషయంలో ఫ్రంట్ రన్నర్‌గా ఉన్న తెలంగాణ.. 50 పైగా పాయింట్లతో మూడు లక్ష్యాలకు సంబంధించి పర్ఫార్మర్ జాబితాలో నిలిచింది. రెండు లక్ష్యాల్లో మాత్రం 50 కంటే తక్కువ పాయింట్లు సాధించి ఆస్పిరెంట్ జాబితాలో ఉంది. వాతావరణ చర్యలు, లింగ సమానత్వం విషయంలో కేవలం 43, 41 పాయింట్లు మాత్రమే సాధించింది.