TELANGANA FORMATION DAY 2023 : తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవ వేడుకలను కేంద్రం ఘనంగా నిర్వహించేందుకు ప్లాన్ చేస్తోంది. జూన్ 2న రాష్ట్ర ప్రభుత్వానికి దీటుగా గోల్కొండ కోటలో కేంద్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో వేడుకలు జరపనుంది. ఈ సందర్భంగా మువ్వన్నెల జెండా ఆవిష్కరణ, పారా మిలటరీ దళాలు కవాతు చేయనున్నాయి. సాయంత్రం సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించనున్నారు. రాష్ట్ర అవతరణ దినోత్సవ వేడుకలకు పలువురు కేంద్రమంత్రులు రానున్నట్లు సమాచారం. కేంద్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో తొలిసారిగా నిర్వహించే రాష్ట్ర అవతరణ వేడుకలకు బీజేపీ శ్రేణులు పెద్ద సంఖ్యలో తరలిరావాలని కేంద్రమంత్రి కిషన్ రెడ్డి పిలుపునిచ్చారు.
ఈసారి నిరుడు లెక్కుండది..: రాష్ట్ర అవతరణ దినోత్సవాలను ఈసారి ఘనంగా నిర్వహించేందుకు రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. తొమ్మిదేళ్లు పూర్తి చేసుకుని.. పదో ఏట అడుగు పెడుతుండటంతో తెలంగాణ ప్రగతిని చాటుతూ పండుగ వాతావరణంలో దశాబ్ది ఉత్సవాలు సాగాలని సీఎం కేసీఆర్ ఆదేశించారు. 21 రోజుల పాటు వేడుకలు జరపాలని.. జూన్ 2న ప్రారంభ వేడుకలను సచివాలయంలో నిర్వహించాలని నిర్ణయించారు. రోజుకు ఒక రంగం చొప్పున 21 రోజుల పాటు ఆయా రంగాల వారీగా తెలంగాణ తొమ్మిదేళ్ల ప్రగతి ప్రస్థానాన్ని చాటేలా కార్యక్రమాలు ఉండాలని సీఎం ఆదేశించారు. ప్రజల భాగస్వామ్యంతో పల్లె నుంచి పట్నం దాకా ఉత్సవాలను పండగ వాతావరణంలో జరుపుకోవాలని సూచించారు.
లోగో ఆవిష్కరణ..: ఈ మేరకు రాష్ట్ర దశాబ్ది ఉత్సవాలకు సంబంధించిన లోగోను సీఎం కేసీఆర్ ఇటీవల విడుదల చేశారు. ఈ లోగోలో దశాబ్ది ఉత్సవాల్లో పది సంఖ్యకు ప్రాధాన్యతను ఇవ్వగా.. 10 సంఖ్యలోని ఒకటిలో రాష్ట్ర సంస్కృతికి ప్రతీక అయిన బతుకమ్మ, బోనాల చిత్రాలను పొందుపరిచారు. పుష్పం ఆకారంలోని సున్నా నమూనా మధ్యలో తెలంగాణ తల్లి చిత్రపటాన్ని డిజైన్ చేశారు. తెలంగాణ తల్లి చుట్టూ ప్రభుత్వ పథకాలను పేర్చారు. ఆ సంఖ్య కింద రాష్ట్ర అవతరణ దశాబ్ది ఉత్సవాలు 2014-2023 అని రాశారు.