Telangana Formation Day Celebrations : ఎంతో మంది త్యాగాల ఫలం తెలంగాణ. ఒకప్పుడు అన్ని రంగాల్లో దేశంలోనే చిట్టచివర ఉన్న తెలంగాణ జిల్లాలు. ఇప్పుడు ప్రతి రంగంలోనూ దేశానికే ఆదర్శంగా నిలుస్తున్నాయి. వ్యవసాయంతో పాటు పారిశ్రామికాభివృద్ధిలో కూడా దూసుకుపోతున్నాయి. పెట్టుబడులను ప్రోత్సహించాలనే ఉద్దేశ్యంతో టీఎస్ ఐపాస్ విధానం తీసుకువచ్చారు. దీంతో పెట్టుబడులు గణనీయంగా పెరిగి.. ఇప్పటికి రూ.2,61,732 కోట్లకు చేరుకుంది. ఈ పెట్టుబడులతో 23,065 యూనిట్ల ద్వారా 15,74,798 మందికి ఉపాధి అవకాశాలు లభించాయి. ఔత్సాహిక పారిశ్రామికవేత్తలకు ప్రోత్సాహకాలు ఇస్తూ యువతకు నైపుణ్య శిక్షణ కోసం టాస్క్, టీహబ్, వీహబ్, టీవర్క్స్ లాంటి కార్యక్రమాలు కూడా చేపట్టింది.
Telangana Day 2023 : ఐటీ రంగంపై సర్కార్ ప్రత్యేకంగా దృష్టి పెట్టింది. ప్రపంచస్థాయి సాంకేతికతలను అందిపుచ్చుకుంటూ భాగ్యనగరం ఐటీ రంగంలో దూసుకుపోతోంది. భారతదేశ సిలికాన్ వ్యాలీగా ప్రసిద్ధి గాంచిన బెంగళూరును కూడా అధిగమించేలా పురోగతిని సాధిస్తోంది అంటే అందుకు ప్రభుత్వ విధానాలే కారణం. రాష్ట్ర ఆవిర్భావ సమయంలో ఐటీ ఎగుమతుల విలువు రూ.57 వేల కోట్లు ఉంటే.. 2022నాటికి రూ.1,83,569 కోట్లకు చేరుకుంది. గూగుల్, అమెజాన్, మైక్రోసాఫ్ట్ లాంటి ప్రపంచ దిగ్గజ సంస్థలన్నీ హైదరాబాద్‌లో కార్యాలయాలు ఏర్పాటు చేశాయి.
"తెలంగాణ ఏర్పడి తొమ్మిది సంవత్సరాల్లోనే దేశంలోనే నంబర్ 1 రాష్ట్రంగా మారింది. అన్ని రంగాల్లోనూ అభివృద్ధి సాధించింది. దేశంలో ఏటా వస్తున్న ఐటీ ఉద్యోగాల్లో మూడోవంతు హైదరాబాద్ నుంచే ఉంటున్నాయంటే ఆశ్చర్యం కలగక మానదు.. హైదరాబాద్ విశ్వనగరంగా వ్యాప్తి చెందుతోంది. ఒకప్పుడు తెలంగాణలో అభివృద్ధి అంటే అందరూ అపహాస్యం చేశారు." - దాసోజు శ్రవణ్ కుమార్, బీఆర్ఎస్ సీనియర్ నేత