TS FORMATION DAY 2023 : రాష్ట్రవ్యాప్తంగా అవతరణ దశాబ్ది వేడుకలు ఘనంగా నిర్వహించేలా ఏర్పాట్లు జోరుగా సాగుతున్నాయి. ప్రారంభ వేడుకలు జరిగే సచివాలయంలో ఏర్పాట్లను ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి పరిశీలించారు. జూన్ 2న ఉదయం పదిన్నరకు ముఖ్యమంత్రి కేసీఆర్ జాతీయ పతాకాన్ని ఆవిష్కరిస్తారని, విభాగాధిపతుల కార్యాలయాల ఉద్యోగులు వేడుకలకు హాజరవుతారని సీఎస్ వెల్లడించారు. అనంతరం శాఖల కార్యదర్శులు, ఉన్నతాధికారులతో సమావేశమైన శాంతి కుమారి.. ప్రారంభ వేడుకలపై సమీక్షించారు.
Telangana Formation Day 2023 : జిల్లాల్లోనూ జోరుగా సన్నాహక సమావేశాలు జరుగుతున్నాయి. మెదక్ నియోజకవర్గ సన్నాహక సమావేశంలో ఎమ్మెల్యే పద్మాదేవేందర్‌రెడ్డి పాల్గొన్నారు. సిద్దిపేట నియోజకవర్గ స్థాయి సమావేశంలో పాల్గొన్న మంత్రి హరీశ్‌రావు.. స్వరాష్ట్ర ప్రగతిని పల్లె, పట్టణాల్లో చాటాలని దిశానిర్దేశం చేశారు. దశాబ్ది వేడుకలు రాజ్‌భవన్‌లోనూ జరగనున్నాయి. జూన్ 2న ఉదయం తొమ్మిది నుంచి నిర్వహించే ఉత్సవాల్లో గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ పాల్గొంటారు. అనంతరం దర్బార్ హాలులో గవర్నర్ తమిళిసై అందుబాటులో ఉంటారు.
ఇతర రాష్ట్రాల్లోనూ 'తెలంగాణ' వేడుకలు..: తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ వేడుకలను కేంద్రం అధికారికంగా నిర్వహిస్తోందని కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి వెల్లడించారు. ఆజాదీ కా అమృత్ మహోత్సవంలో భాగంగా హైదరాబాద్ గోల్కొండ కోటలో జూన్ 2, 3న కేంద్ర సాంస్కృతిక శాఖ ఆధ్వర్యంలో వేడుకలు నిర్వహిస్తున్నట్లు చెప్పారు. వివిధ రాష్ట్రాల రాజ్‌భవన్‌లలోనూ తెలంగాణ ఆవిర్భావ వేడుకలు జరపుతున్నట్లు తెలిపారు. రానున్న రోజుల్లో అన్ని రాష్ట్రాల ఆవిర్భావ వేడుకలు రాజ్‌భవన్‌లలో జరుగుతాయని కిషన్‌రెడ్డి తెలిపారు.
వేడుకలకు లోక్‌సభ మాజీ స్పీకర్.. : అవతరణ వేడుకలు ఘనంగా నిర్వహించనున్నట్లు కాంగ్రెస్ నేతృత్వంలోని వేడుకల నిర్వహణ కమిటీ ఛైర్మన్ చిన్నారెడ్డి వెల్లడించారు. గాంధీభవన్‌లో అవతరణ వేడుకల నిర్వహణ కమిటీ ప్రత్యేకంగా సమావేశమై చర్చించింది. వేడుకలకు ముఖ్య అతిథిగా లోక్‌సభ మాజీ స్పీకర్ మీరాకుమార్ హాజరవుతారని కాంగ్రెస్ సీనియర్ నేత హనుమంతురావు తెలిపారు. 20 రోజుల పాటు కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో వేడుకలను నిర్వహించనున్నట్లు ఆయన స్పష్టం చేశారు. కార్యకర్తలంతా తమ ఇళ్లపై కాంగ్రెస్ జెండాను ఎగురవేయాలని గుర్తు చేశారు.