Telangana Decade Celebrations : 2014 జూన్ రెండో తేదీన ఆవిర్భవించిన తెలంగాణ రాష్ట్రం.. తొమ్మిది వసంతాలు పూర్తి చేసుకొంది. పదో ఏట అడుగుపెడుతున్న వేళ రాష్ట్ర అవతరణ దశాబ్ది ఉత్సవాలుఘనంగా, వైభవంగా జరగనున్నాయి. ప్రత్యేక సందర్భాన్ని పురస్కరించుకొని మూడు వారాల పాటు వేడుకలు నిర్వహించాలని నిర్ణయించిన రాష్ట్ర ప్రభుత్వం.. అందుకనుగుణంగా ఏర్పాట్లు చేసింది. ఈ వేడుకలను సచివాలయంలో ముఖ్యమంత్రి కేసీఆర్ నేడు ప్రారంభించనున్నారు.
KCR on Telangana Formation Day Celebrations :ఈ క్రమంలోనే కేసీఆర్ ఉదయం గన్‌పార్క్‌లోని అమరవీరుల స్థూపం వద్ద నివాళులు అర్పించిన తర్వాత.. సచివాలయంలో వేడుకలను ప్రారంభిస్తారు. జాతీయ పతాకాన్ని ఆవిష్కరించి పోలీసుల గౌరవ వందనం స్వీకరిస్తారు. అనంతరం సభికులనుద్దేశించి ప్రసంగించి దశాబ్ది వేడుకల సందేశాన్ని కేసీఆర్ అందిస్తారు. సచివాలయ ప్రారంభం అనంతరం జరుగుతున్న మొదటి కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించేందుకు ఏర్పాట్లు చేశారు. మొత్తం 15,000 మందికి సరిపడేలా కుర్చీలు ఏర్పాటు చేశారు.
Telangana Formation Day celebrations 2023 : సచివాలయ ఉద్యోగులతో పాటు జీహెచ్ఎంసీ పరిధిలోని విభాగాధిపతుల కార్యాలయాల్లోని ఉద్యోగులు.. వేడుకలకు హాజరు కానున్నారు. వారి కోసం ప్రత్యేకంగా 300 బస్సులు ఏర్పాటు చేశారు. వర్షం, ఎండకు సంబంధించి కూడా ఎలాంటి ఇబ్బందులు లేకుండా టెంట్లు వేశారు. ఈ ప్రారంభ వేడుకల కోసం రూ.1.80 కోట్లు మంజూరు చేశారు. విభాగాధిపతులు అందరూ ఉదయం ఏడున్నరకు తమ కార్యాలయాల్లో జాతీయ పతాకాన్ని ఆవిష్కరించి.. ఎనిమిది గంటల్లోపు సచివాలయం చేరుకోవాలని ఆదేశించారు.
సచివాలయంప్రధాన ద్వారం ముందు వేడుకల ఏర్పాట్లు చేసిన తరుణంలో.. సీఎం కేసీఆర్ వేడుకలకు పశ్చిమ ద్వారం నుంచి సచివాలయంలోకి ప్రవేశించనున్నారు. జిల్లా కేంద్రాల్లో మంత్రులు, ప్రముఖులు జాతీయ పతాకాన్ని ఆవిష్కరించి వేడుకలను ప్రారంభిస్తారు. ప్రజాప్రతినిధులు, అధికారులు వారి వారి కార్యాలయాల్లోని వేడుకల్లో పాల్గొంటారు. రాష్ట్రంలోని అన్ని ప్రభుత్వ సంస్థలు, కార్యాలయాల్లో ప్రారంభ వేడుకల సందర్భంగా జాతీయ జెండాను ఆవిష్కరించాలని ఇప్పటికే ఆదేశాలు జారీ చేశారు.
Telangana Decade Celebrations Schedule :ఉత్సవాల సందర్భంగా రాజధానితో పాటు అన్ని జిల్లాల్లో కార్యాలయాలు, చారిత్రక కట్టడాలు, ప్రధాన కూడళ్లను.. విద్యుత్ దీపాలతో అలంకరించారు. రాష్ట్ర వ్యాప్తంగా 21 రోజుల పాటు ఈ నెల 22 వరకు దశాబ్ది ఉత్సవాలు జరగనున్నాయి. ఒక్కో రోజును ఒక్కో రంగానికి కేటాయించి.. ఆయా రంగాల్లో తొమ్మిదేళ్ల ప్రగతిని వివరించనున్నారు. అన్ని వర్గాల ప్రజలు, వివిధ ప్రభుత్వ కార్యక్రమాలు, పథకాల లబ్దిదారులను భాగస్వామ్యుల్ని చేస్తూ వేడుకలు నిర్వహించనున్నారు.