తెలంగాణ

telangana

ETV Bharat / state

Swachh survekshan: స్వచ్ఛ సర్వేక్షణ్‌లో అవార్డులే లక్ష్యంగా పురపాలకశాఖ చర్యలు

రానున్న స్వచ్ఛ సర్వేక్షణ్​లో మరిన్ని అవార్డులను రాష్ట్ర పురపాలకశాఖ లక్ష్యంగా పెట్టుకొంది. పారిశుద్ధ్యం సహా ఆయా పట్టణాల్లో చేపట్టిన కార్యక్రమాలు అవార్డులను తెచ్చిపెడతాయన్న విశ్వాసంతో సర్కారు ఉంది. ఆ దిశగా ఇప్పట్నుంచే కార్యాచరణ ప్రారంభించింది. ప్రజలందరినీ భాగస్వామ్యుల్ని చేయడం ద్వారా మెరుగైన ఫలితాలు రాబట్టవచ్చన్న ఆశాభావంతో ఉంది. అధికార యంత్రాంగానికి ఇప్పటికే దిశానిర్ధేశం చేశారు.

Swachh survekshan: స్వచ్ఛ సర్వేక్షణ్‌లో అవార్డులే లక్ష్యంగా పురపాలకశాఖ చర్యలు
Swachh survekshan: స్వచ్ఛ సర్వేక్షణ్‌లో అవార్డులే లక్ష్యంగా పురపాలకశాఖ చర్యలు

By

Published : Dec 4, 2021, 3:00 AM IST

ప్రస్తుత ఏడాది కేంద్ర ప్రభుత్వం నిర్వహించిన స్వచ్చ సర్వేక్షణ్​లో తెలంగాణ మంచి పనితీరు కనబరిచింది. సఫాయి మిత్ర ఛాలెంజ్​లో రెండో స్థానం సహా మొత్తం 12 అవార్డులను రాష్ట్రానికి చెందిన పట్టణాలు, నగరాలు దక్కించుకున్నాయి. ఈ స్ఫూర్తితో 2022 స్వచ్ఛ సర్వేక్షణ్​కు కూడా పురపాలకశాఖ సిద్ధమవుతోంది. జనవరి నుంచి ఈ ప్రక్రియ ప్రారంభం కానుంది. ఫిబ్రవరిలో కేంద్ర పట్టణాభివృద్ధి శాఖ బృందాలు రాష్ట్రంలో క్షేత్రస్థాయిలో పర్యటించి వాస్తవ పరిస్థితులను పరిశీలిస్తాయి. ఆ ప్రకారం మార్కులు ఇస్తారు. ఈ ఏడాది 12 అవార్డులు వచ్చిన నేపథ్యంలో పురపాలక శాఖ అధికారుల కృషిని అభినందించిన మంత్రి కేటీఆర్... వచ్చే ఏడాదికి సంబంధించి లక్ష్యాన్ని నిర్దేశించారు. 2020లో నాలుగు అవార్డులు రాగా... 2021లో మూడంతలు 12 అవార్డులు దక్కాయి. దీంతో వచ్చే ఏడాదికి అవార్డుల సంఖ్య కనీసం రెట్టింపు కావాలని కేటీఆర్ అధికారులకు స్పష్టం చేశారు.

అవార్డులు దక్కించుకునేందుకు కసరత్తు

మంత్రి ఆదేశాల నేపథ్యంలో పురపాలకశాఖ ఆ దిశగా కసరత్తును ప్రారంభించింది. జీహెచ్ఎంసీ మినహా రాష్ట్రంలో మిగిలిన 141 కార్పొరేషన్లు, మున్సిపాలిటీల కమిషనర్లతో పురపాలకశాఖ ఇప్పటికే కార్యశాల నిర్వహించింది. 2022 స్వచ్ఛ సర్వేక్షణ్ లక్ష్యంగా వారికి దిశానిర్ధేశం చేసింది. పురపాలక శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి అరవింద్​ కుమార్, సంచాలకులు సత్యనారాయణ కమిషనర్లతో ప్రత్యేకంగా కార్యశాల నిర్వహించి తీసుకోవాల్సిన చర్యలు, అనుసరించాల్సిన విధానాలపై అవగాహన కల్పించారు. స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్ ముగిశాక రాష్ట్ర వ్యాప్తంగా మేయర్లు, డిప్యూటీ మేయర్లు, ఛైర్మన్లు, వైస్ ఛైర్మన్లతో పురపాలకశాఖ ప్రత్యేకంగా సమావేశాలు నిర్వహించనుంది. అందరి భాగస్వామ్యంతో మరింత మెరుగైన పనితీరు కనబర్చడం ద్వారా స్వచ్ఛ సర్వేక్షణ్ లో మంచి ఫలితాలు సాధించే విషయమై వారితో చర్చించి కార్యాచరణ ఖరారు చేస్తారు. పరిశుభ్రమైన నగరాలు ధ్యేయంగా రాష్ట్రంలో పట్టణప్రగతి పేరిట ప్రత్యేక కార్యక్రమాన్ని అమలు చేస్తారు. కార్యక్రమ లక్ష్యాలను పూర్తి స్థాయిలో అమలు చేయడం ద్వారా కనీసం 25 నుంచి గరిష్టంగా 50 వరకు అవార్డులు దక్కించుకునే అవకాశం ఉంటుందని అంచనా వేస్తున్నారు.

8పట్టణాలకు ఓడీఎఫ్ డబుల్ ప్లస్ హోదా

రాష్ట్రంలో ప్రస్తుతం 101 పట్టణాలు ఓడీఎఫ్ ప్లస్ హోదాను పొందాయి. ప్రస్తుతం ఎనిమిది పట్టణాలకు ఓడీఎఫ్ డబుల్ ప్లస్ హోదా ఉంది. మిగతా పట్టణాలకు సంబంధించిన ప్రక్రియ కూడా కొనసాగుతోంది. 50 వరకు ఓడీఎఫ్ డబుల్ ప్లస్ హోదా వచ్చే అవకాశం ఉందని భావిస్తున్నారు. పచ్చదనం పెంపుతో పాటు నీటి పునర్వినియోగం నేపథ్యంలో పట్టణాలకు వాటర్ ప్లస్ హోదా దక్కనుంది. పబ్లిక్ టాయిలెట్స్ నిర్వహణ కోసం 18 ప్రమాణాలతో రూపొందించిన ప్రత్యేక యాప్ ఓడీఎఫ్ ప్లస్ హోదాకు బాగా ఉపయోగపడిందని అధికారులు చెప్తున్నారు. డీఆర్సీ కేంద్రాలు, కంపోస్టింగ్, బయో మైనింగ్ తదితరాలు పూర్తి స్థాయిలో అమలు చేయడం ద్వారా మరింత మెరుగైన స్థితిలో ఉండవచ్చని భావిస్తున్నారు. పారిశుద్ధ్య నిర్వహణలో భాగంగా వందశాతం చెత్తసేకరణ, ప్రాసెసింగ్ తో పాటు భవన నిర్మాణ వ్యర్థాల సమగ్ర నిర్వహణ ద్వారా మంచి ఫలితాలు రాబట్టాలని... వీలైనంత త్వరగా మానవవ్యర్థాల శుద్ధి కేంద్రాల పనులను పూర్తి చేసి అందుబాటులోకి తేవాలని మున్సిపల్ కమిషనర్లకు స్పష్టం చేశారు.

ప్రజల భాగస్వామ్యం కీలకమే..

పట్టణప్రగతిలో నిర్ధేశించుకున్న లక్ష్యాలన్నీ పకడ్బందీగా, పూర్తి స్థాయిలో అమలయ్యేలా చర్యలు తీసుకోవాలని తెలిపారు. అటు స్వచ్చ సర్వేక్షణ్ లో ప్రజల భాగస్వామ్యం కూడా కీలకం కానుంది. ప్రజల్లో విస్తృత అవగాహన కల్పించేలా వివిధ రకాల పోటీలు, కార్యక్రమాలు కూడా చేపట్టాల్సి ఉంది. ఈ నెల ఏడో తేదీలోగా ఆయా పట్టణాల్లో వాటన్నింటిని పూర్తి చేసి నివేదికలు పంపాలని అధికారులకు పురపాలకశాఖ స్పష్టమైన ఆదేశాలు జారీ చేసింది.

ఇదీ చదవండి:

Cyclone Jawad warning for AP: అత్యవసరమైతే తప్ప బయటికి రావొద్దు.. అధికారుల హెచ్చరిక

ABOUT THE AUTHOR

...view details