Central Team Visits Telangana Flooded Areas : భారీ వర్షాలతో జరిగిన నష్టాన్ని అంచనా వేసేందుకు రాష్ట్రానికి వచ్చిన కేంద్ర బృందం.. జిల్లాల్లో అధికారులతో సమావేశం కావడంతోపాటు క్షేతస్థాయిలో పర్యటించి వివరాలు సేకరించింది. తొలుత హనుమకొండ కలెక్టరేట్‌లో ఏర్పాటు చేసిన ఛాయా చిత్ర ప్రదర్శనను తిలకించింది. హనుమకొండ, వరంగల్‌లో జలమయమైన కాలనీలు, కూలిన ఇళ్లు, పంటనష్టం, దెబ్బతిన్న రహదారులు సర్వం కోల్పోయి నష్టపోయిన బాధితులకు సంబంధించిన వివరాలను రెండు జిల్లాల కలెక్టర్లు, గ్రేటర్ వరంగల్ కమిషనర్.. కేంద్ర బృందానికి వివరించారు. అనంతరం హన్మకొండలోని జవహార్‌నగర్‌తో పాటు నయింనగర్, వరంగల్ జిల్లాలోని ఎన్ఎన్ నగర్. బొందివాగు, భద్రకాళీ చెరువు కట్ట ప్రాంతాలను సందర్శించింది.
Central Team Visits Flood Affected Telangana : వరదల కారణంగా రూ.450 కోట్ల మేర నష్టం జరిగిందని 14 మండలాలు ప్రభావితంకాగా.. వెయ్యి ఎకరాల్లో రూ.1.8 కోట్ల మేర నష్టం జరిగిందని తెలిపారు. అనంతరం భూపాలపల్లి, ములుగు జిల్లాల అధికారులతో సమావేశమై వివరాలు సేకరించింది. ఆ తర్వాత భూపాలపల్లి జిల్లాలోని మోరంచ గ్రామాన్ని సందర్శించి బాధితులతో మాట్లాడి వివరాలు సేకరించింది. ములుగు జిల్లాలో ఏజెన్సీ ప్రాంతాలను పర్యటించి క్షేత్రస్థాయిలో నష్టాన్ని ప్రత్యక్షంగా పరిశీలించి అంచనా వేసింది. ఆ తర్వాత భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో కేంద్ర బృందం పర్యటించింది. వర్షాలు, గోదావరి వరదలతో దెబ్బతిన్న రోడ్లు, పంట పొలాలు, వంతెనలు ఇళ్లు తదితర నష్టాలను తెలియజేస్తూ భద్రాచలం ఐటీడీఏ కార్యాలయంలో ఏర్పాటు చేసిన ఫోటో ఎగ్జిబిషన్‌ను కేంద్ర కమిటీ అధికారులు పరిశీలించారు. బూర్గంపాడు మండలంలో జరిగిన రహదారి ధ్వంసంతోపాటు వివిధ ప్రాంతాల్లో నష్టపోయిన ప్రదేశాలను తిరిగి నష్టాన్ని ప్రత్యక్షంగా చూశారు.